బాబు ఢిల్లీ టూర్ తో బలరాం బిందాస్

Balaram Bindas with Babu Delhi Tour

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో నిన్నమొన్నటిదాకా అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా వుంది. ఓ నెల రోజులుగా పరిస్థితిలో అనూహ్య మార్పు వచ్చింది. అంతకు ముందు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం వర్గాల మధ్య ఏ పాటి రచ్చ జరిగిందో అందరూ చూసారు. మరీ ముఖ్యంగా కరణం బలరాం ఆగ్రహావేశాలు ఒక్క ప్రకాశం జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్రం అంతటా చర్చకి దారి తీసింది. టీడీపీ కి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. రెండు వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించి వల్లగాక చంద్రబాబు సైతం ఓ దశలో బలరాం వైఖరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలా వున్న పరిస్థితి ఈ మధ్య లోకేష్ అద్దంకి పర్యటనతో కామ్ అయిపోయింది. పార్టీ వర్గాలే ఈ మార్పు చూసి ఆశ్చర్యపోయాయి. అంతకుముందు ఆగ్రహావేశాలతో రగిలిపోయిన బలరాం ఇప్పుడు ప్రసన్నంగా, బిందాస్ గా రాష్ట్ర మంత్రులతో కలిసి కనిపిస్తున్నారు. ఇంతలో ఆ మార్పు ఎలా వచ్చిందో తెలుసా…

అద్దంకి ని పక్కనబెడితే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్ కి సంబంధించి అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ దక్కిందట. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గ టికెట్ గారంటీ అని చెప్పిందట. అయితే ఇప్పుడు జిల్లాలో వున్న పరిస్థితుల్లో స్థానిక నాయకత్వాన్ని కాదని ముందుకు వెళితే ఇబ్బందులు తప్పవని బలరాం అనుకున్నారు. పార్టీతో ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత కూడా ఇటు నియోజకవర్గం, అటు టికెట్ కోసం ఇంతగా ఆందోళన చెందాల్సి రావడంతో ఆయన ఆవేదన పడ్డారు. అయితే నియోజకవర్గాల పెంపు ఖాయమని వచ్చిన సంకేతాలతో ఆయన కూల్ అయ్యారు.  ఇటీవల బాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ తో భేటీ తర్వాత కనిపించిన సంకేతాలతో బలరాం బిందాస్ గా కనపడుతున్నారు. నియోజకవర్గాలు పెరిగితే కొత్తగా వచ్చే వాటిలో తన పాత నియోజకవర్గం మార్టూరు వచ్చే అవకాశం ఉందన్న వార్తతో ఆయన ఖుషీఖుషీగా వున్నారు.