బీజేపీకి మేధావులు గొయ్యి … బీ అలెర్ట్ .

BJP Government Has To Be Alert With Failure Leaders In The Party
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

100 ఏళ్ళకి పైగా చరిత్ర వున్న కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ఆ పార్టీ దెబ్బ తిన్న ఒక్క రాష్ట్రంలో కూడా తిరిగి కోలుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందా అని కాంగ్రెస్ శ్రేణులే కాదు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా నెత్తినోరు కొట్టుకుంటున్నారు. కానీ ఫలితం లేదు. జరిగిన తప్పులేమిటో గుర్తించకుండా ఎంత నెత్తినోరు బాదుకున్నా ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని 10 జన్ పథ్ కాస్త ఆలస్యంగా గుర్తించింది.

యూపీఏ టైం లో కాంగ్రెస్ చేసిన భారీ తప్పులు ఏమిటో తేల్చడానికి ఓ ప్రయివేట్ సంస్థకి పని అప్పగించిందట. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక చూసాక సోనియా, రాహుల్ గాంధీకి కళ్ళు తిరిగినంత పని అయ్యిందట. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ తరపున ప్రజల్లో బేస్ ఏర్పర్చుకున్న నాయకుల కన్నా నాలుగు ఓట్లు తెచ్చే దమ్ము లేకపోయినా ఢిల్లీలో మేధావులుగా ముద్రపడ్డ వాళ్ళే పెత్తనం చెలాయించారట. వీళ్ళ పెత్తనం కోసం జనాల్లో ఆదరణ వున్న నాయకుల్ని తొక్కేశారు. ఈ లిస్ట్ లో చిదంబరం, అహ్మద్ పటేల్, జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్,దిగ్విజయ్ …. ఇలా చాలా మంది వున్నారు. వీరిలో ఏ ఒక్కరు సొంతంగా కేవలం కాంగ్రెస్ టికెట్ మీద దేశంలో ఎక్కడా ఎమ్మెల్యే లేదా ఎంపీ గా గెలిచే సత్తా వున్నవాళ్లు కాదు. అయినా అధికారంలో వున్నప్పుడు సోనియా , రాహుల్ వీళ్ళ మాటే విన్నారు. వీళ్ళనే నమ్మారు. అందుకే ఏ రాష్ట్రంలో కూడా జనాల్లో కాంగ్రెస్ ని నిలబెట్టే దమ్ము, ధైర్యం, చొరవ వున్న నాయకులు లేకుండా పోయారట. ఒకవేళ వున్నా అధిష్టానం మీద నమ్మకం లేక సైలెంట్ గా ఉండిపోతున్నారంట. ఈ పరిస్థితిని మార్చాలంటే మేధావుల్ని పార్టీ వ్యూహాలకి మాత్రమే పరిమితం చేసి ప్రజల్లో పలుకుబడి వున్న నాయకుల్ని రాజకీయంగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ని మార్చడానికి కాంగ్రెస్ సిద్ధపడలేదు. ఇక వైసీపీ అధినేత జగన్ కి కూడా స్నేహ హస్తం చాచడానికి కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

ఏ జాడ్యాన్ని వదిలించుకొని తిరిగి ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళడానికి కాంగ్రెస్ సిద్ధం అవుతుందో , ఆ జాడ్యాన్ని తగిలించుకోడానికి బీజేపీ రెడీ అవుతోంది. పార్టీ కి క్షేత్ర స్థాయిలో వున్న ఓటు బ్యాంకు, రాజకీయంగా వున్న పరిస్థితులు ఇవేమీ గ్రహించకుండా ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కొందరు మేధావులు ఆ పార్టీ కి తయారు అయ్యారు. వాస్తవిక పరిస్థితులకి భిన్నంగా వ్యవహరిస్తున్న వీళ్ళు ఇస్తున్న ప్రకటనలు పార్టీ పెరుగుదలకు కాకుండా ఇంకా దిగజారేందుకు పనికి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలు గమనించకుండా రామ్ మాధవ్, మురళీధరరావు లాంటి నేతలు ఢిల్లీ నుంచి దిగుమతి అయ్యి ఇక్కడ అద్భుతాలు సృష్టిస్తాం అనుకుంటున్నారు. తమ తొందరపాటుతో వున్న కొద్ది మంది సానుభూతిపరుల్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఆంధ్రాలో తాము కూడా రేసులో వున్నామని మురళీధరరావు, కెసిఆర్, బాబు సర్కార్ హయాంలో అవినీతి అని రామ్ మాధవ్ చెబుతున్న మాటలు చూసి జనం కాదు బీజేపీ క్యాడర్ ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే మంచిది.

నిన్నగాక మొన్న కాకినాడలో ఇలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీ కి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వారిని చూసి కమలనాధులు పట్టుబట్టి 9 సీట్లు అడిగారు. వాటిలో మూడు గెలిస్తే అందులో ఇద్దరు చివరినిమిషంలో వైసీపీ నుంచి బీజేపీ లో చేరినవాళ్లు. ఈ ఫలితం చూసాక అయినా బీజేపీ టోన్ లో మార్పు వస్తుంది అనుకుంటే ఇప్పుడు రామ్ మాధవ్, మురళీధరరావు వచ్చి హడావిడి చేస్తున్నారు. వీళ్ళ మాటల మాయలో పడకుండా బీజేపీ హైకమాండ్ కాస్త మనసు పెట్టి చూస్తే నిజాలు ఏమిటో అర్ధం అవుతాయి. లేదా కాంగ్రెస్ లాగానే ఈ సూడో మేధావులు బీజేపీ కి కూడా గొయ్యి తవ్వేస్తారు. బీ అలెర్ట్.