ఆ 8 దేశాల పౌరుల‌కు అమెరికాలో ప్ర‌వేశం లేదు

Donald Trump Banned People From 8 Countries Entering Into US
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌పంచంలోని ఎనిమిది దేశాల‌కు అగ్ర‌రాజ్యం అమెరికాలో అడుగుపెట్టే హ‌క్కు లేదు. ఈ మేర‌కు అమెరికా అధ్య‌క్షుడు తాజా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో గ‌తంలో ఆరు దేశాలు ఉండ‌గా… ఇప్పుడు మ‌రో మూడు దేశాలను చేర్చారు. గ‌తంలో ఉన్న ఆరుదేశాల్లో ఒక‌టైన సూడాన్ పై నిషేధం ఎత్తివేశారు. తాజా జాబితాలో అమెరికాతో క‌య్యానికి కాలు దువ్వుతున్న ఉత్త‌ర‌కొరియాపై నిషేధం విధించారు. దాంతో పాటు వెనెజులా, చాద్ దేశాల పౌరుల‌నూ త‌మ దేశంలో అడుగుపెట్ట‌నీకుండా నిషేధాజ్ఞ‌లు జారీచేశారు. ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన కొన్నిరోజుల‌కే ఇరాన్, లిబియా, సిరియా, యెమ‌న్, సోమాలియా, సూడ‌న్ దేశాల‌పై 90 రోజుల పాటు ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆ గ‌డువు ఆదివారంతో ముగియ‌డంతో కొత్త ఆదేశాలు జారీచేసింది ట్రంప్ ప్ర‌భుత్వం.

గ‌త జాబితాలో ఉన్న దేశాల‌పై త‌క్ష‌ణ‌మే నిషేధం అమ‌ల్లోకి వ‌స్తుండ‌గా… కొత్త జాబితాలో చేర్చిన దేశాల‌పై మాత్రం అక్టోబ‌రు 18 నుంచి నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి. వ‌రుస క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌తో అమెరికాను బెంబేలెత్తిస్తున్న ఉత్త‌రకొరియాపై ట్రంప్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అందుకే ఆ దేశాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. ఇక చాద్ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల నిర్మూల‌న‌కు సంబంధించి అమెరికాకు ఎలాంటి స‌హ‌కారం అందించ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ఆ దేశ పౌరుల‌పై నిషేధాజ్ఞ‌లు జారీచేశారు. వెనెజులా పౌరుల‌కు పాక్షికంగా మాత్రమే నిషేధం వ‌ర్తిస్తుంది. వెనెజులా సామాన్య పౌరులు అమెరికాలో అడుగుపెట్టొచ్చు కానీ.. ఆ దేశానికి చెందిన ప్ర‌భుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులు మాత్రం అగ్రరాజ్యంలో ప్ర‌వేశానికి అన‌ర్హులు. ట్రావెల్ బ్యాన్ విధించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ట్రంప్ ట్విట్ట‌ర్ లో వివ‌రించారు. అమెరికాను సుర‌క్షితంగా మార్చ‌డ‌మే త‌న మొద‌టి ప్రాధాన్య‌త అని, త‌మ భ‌ద్ర‌త‌కు భంగం క‌లిగించే వారిని దేశంలోకి అనుమ‌తించ‌బోమ‌ని ట్రంప్ ట్విట్ట‌ర్ లో స్ప‌ష్టంచేశారు.