పాకిస్థాన్ ఓ విఫ‌ల‌మైన దేశం…

Eenam Gambhir says Pakistan is terroristan in United Nation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా పాకిస్థాన్ పై భార‌త్ మ‌రోసారి మండిప‌డింది. పాకిస్థాన్ కు భ‌య‌ప‌డి భార‌త్ కాశ్మీర్ ప్ర‌జ‌ల‌ను అణిచివేసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సాధార‌ణ స‌మావేశంలో న‌వాజ్ ష‌రీఫ్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు భార‌త్ దీటుగా బ‌దులిచ్చింది. ఉగ్ర‌వాదుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారిన పాకిస్థాన్… భార‌త్ లోని మాన‌వ హ‌క్కుల గురించి ప్ర‌సంగాలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని, ఐరాస‌లో భార‌త తొలి సెక్ర‌ట‌రీ ఈన‌మ్ గంభీర్ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ ను ఆమె టెర్ర‌రిస్థాన్ గా అభివ‌ర్ణించారు.

గ‌డ‌చిన కొన్నేళ్ల చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే… పాకిస్థాన్ ఉగ్ర‌వాదానికి మారుపేరుగా ఉన్న విష‌యం అర్ధ‌మ‌వుతుంద‌ని, ఆ దేశం ఉగ్ర‌వాదుల‌ను త‌యారుచేసి, వారిని ప్ర‌పంచ‌దేశాల‌కు ఎగుమ‌తి చేస్తోంద‌ని ఈన‌మ్ మండిప‌డ్డారు. ఉగ్ర‌వాదుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం కోసం పాకిస్థాన్ బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చుపెడుతోంద‌ని, అక్క‌డి ఉగ్ర‌వాద సంస్థ‌ల నేత‌ల‌కు రాజ‌కీయ‌ప‌రంగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. భార‌త్ లో ర‌క్త‌పుటేరులు పారించిన ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తోయిబా అధినేత హ‌ఫీజ్ మహ్మ‌ద్ సయీద్ ప్ర‌స్తుతం పాకిస్థాన్ లో ఓ చ‌ట్ట‌బ‌ద్ద‌మైన రాజ‌కీయ పార్టీ నాయ‌కుడు అయ్యేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని ఈన‌మ్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

స్వ‌చ్ఛ‌మైన భూమి అన్న అర్ధం ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు స్వ‌చ్ఛ‌మైన ఉగ్ర‌వాద భూభాగంగా మారిందని ఆమె విమ‌ర్శించారు. ఉగ్ర‌వాదులు వీధుల్లో స్వేచ్ఛ‌గా తిరుగాడే అవ‌కాశం క‌ల్పించిన పాకిస్థాన్ కు భార‌త్ గురించి మాట్లాడే హ‌క్కులేద‌ని, కాశ్మీర్ ఎప్ప‌టికీ భార‌త్ లో భూభాగ‌మ‌ని, అది అర్ధం చేసుకుని పాకిస్థాన్ మ‌స‌లుకోవాల‌ని ఆమె హెచ్చ‌రించారు. ఓ విఫ‌ల‌మైన దేశంగా మిగిలిపోయిన పాకిస్థాన్… ప్ర‌జాస్వామ్యం, మాన‌వ‌హ‌క్కుల గురించి చేసే ప్ర‌సంగాలను వినాల్సిన అవ‌స‌రం ప్ర‌పంచానికి లేద‌ని ఈమ‌న్ అన్నారు.