ఇకనైనా బార్క్ రేటింగ్స్ కచ్చితంగా వస్తాయా?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

  • is bark ratings coming correct in ap and telangana statesఇకనైనా బార్క్ రేటింగ్స్ కచ్చితంగా వస్తాయా?
  • శాంపిల్ సైజు పెంచిన బార్క్
  • ఇప్పుడు 30 వేల ఇళ్లలో రేటింగ్స్ లెక్కింపు
  • 8 వ వారం నుంచి సమాచారంలో కీలక మార్పులు
  • తెలుగు రాష్ట్రాల్లో 60% గ్రామీణ ప్రాంతాలు

టీవీ ప్రేక్షకాదరణను కొలిచే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ఇప్పుడు తన పరిధిని విస్తరించటం ద్వారా విశ్వసనీయత పెంచుకునే పనిలో పడింది. ఇటీవలి కాలంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో శాంపిల్ ఇళ్లు తెలుసుకోవటం మీద వెల్లువెత్తిన దుమారంతో ఇబ్బందుల్లో పడిన బార్క్ దాన్ని సరిదిద్దుకునే క్రమంతోబాటు విశ్వసనీయత పెంచుకోవటం కోసం మరిన్ని కొత్త మార్కెట్లకు విస్తరించింది. శాంపిల్ సైజు పెంచింది. అంటే, మొత్తం 30 వేల ఇళ్లలో లెక్కించటానికి సిద్ధమైంది. దీనివలన మరింత కచ్చితమైన ఫలితాలు అందుతాయని తీవీ పరిశ్రమ భావిస్తోంది.

మార్చి 2 తరువాత అందుబాటులోకి వచ్చే తాజా సమాచారం లో పెనుమార్పులు ఉంటాయని ముందే ఊహిస్తుండగా ఈ సమాచారాన్ని అంతకు ముందు సమాచారంతో పోల్చటానికి వీల్లేదని కూదా పరిశ్రా వర్గాలు చెబుతున్నాయి. శాంపిల్ లో సమూలమైన మార్పులు చేసినందువలన అలాంటి పోలికలకు బదులుగా ఇకమీదట వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్లేషించుకోవటమే సమంజసమన్న వాదనతో బార్క్ కూడా ఏకీభవిస్తోంది.

బార్క్ లెక్కింపులో స్థూలంగా వచ్చిన మార్పులివి:
మొత్తం లెక్కింపు పరిధిలోకి వచ్చే ఇళ్ళ సంఖ్య ప్రస్తుతమున్న 15 కోట్ల 40 లక్షల నుంచి 18 కోట్ల 30 లక్షలకు పెరిగింది. వ్యక్తుల సంఖ్య కోణంలో చూస్తే అది 67 కోట్ల 50 లక్షల నుంచి78 కోట్లకు పెరిగింది.

బార్క్ శాంపిల్ సైజు ఇప్పుడున్న 20 వేల ఇళ్ల నుంచి 30 వేల ఇళ్లకు పెరిగింది. అంటే బార్క్ బారోమీటర్ పెట్టే ఇళ్ళు 10 వేలు పెరిగాయి.
పాత లెక్కింపుతో పోల్చుకుంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పెరుగుదల ఎక్కువగా నమోదైంది. గ్రామీణ ప్రాంతంలో 23% పెరుగుదల నమోదు కాగా పట్టణ ప్రాంతంలో శాంపిల్స్ 8% తక్కువగా నమోదయ్యాయి.

వయోవర్గాల కోణంలో చూస్తే, ఇప్పటిదాకా నాలుగేళ్ళ వయసున్న వాళ్ళనుంచీ లెక్కిస్తూ ఉండగా ఇకమీదట రెండేళ్ల వారి నుంచీ లెక్కిస్తారు.
వ్యక్తుల శాంపిల్స్ కోణంలో చూస్తే 2-14 వయోవర్గంలో అత్యధికంగా 60 శాతం పెరుగుదల కనిపిస్తోంది. 2, 3 ఏళ్ల వయసున్నవాళ్ళు వచ్చి చేరటం వలన ఈ భారీ మార్పు నమోదైంది. ఇప్పటివరకూ విడివిడిగా ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ గణాంకాలను ఇకమీదట కలిపే అందిస్తారు. అంటే ఒకే మార్కెట్ గా లెక్కిస్తారు.అదే విధమ్గా బీహార్, జార్ఖండ్ మార్కెట్లను కూడా కలిపి ఒకే మార్కెట్ కింద లెక్కించి ప్రేక్షకాదరణ డేటా అందిస్తారు.

బార్క్ ఎట్టకేలకు గ్రామీణ ప్రేక్షకాదరణ సమాచారాన్ని బాగా పెంచి ఇవ్వబోతోంది. ఇప్పటివరకూ లక్షలోపు జనాభా ఉన్న పట్టణలను, గ్రామాలను లెక్కలోకి తీసుకోకపోవటం వలన సగం మంది ప్రేక్షకుల అభిప్రాయాలకు తావులేకుండా పోయిందన్న విమర్శ ఉన్న సంగతి తెలిసిందే. టామ్ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన బార్క్ ఆ లోటు భర్తీ చేస్తానని కొంత కాలంగా చెబుతూ వచ్చింది. గతంలో కొంతమేరకు గ్రామీణ ప్రేక్షకులను కలిపినా, ఈ సారి ఆ సంఖ్య గణనీయంగా ఉంది.

ఇప్పటివరకూ 7 కోట్ల 75 లక్ష్జల పట్టణప్రాంత ఇళ్ళనుంచి శాంపిల్స్ సేకరించగా తాజా డేటా లో మరో 7 కోట్ల 60 లక్షలగ్రామీణ ప్రేక్షకుల ఇళ్ళు కూడా చేరుతున్నాయి. దాదాపు రెండూ సమానమైన శాంపిల్స్ తీస్తూ ఉండటం వలన వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. టామ్ తో ఈ మధ్యనే ఒప్పందం కుదుర్చుకొని వారి మీటర్లు కూడా వాడుకోబోతున్న బార్క్ ఇవ్వబోయే ఫలితాలమీద టీవీ పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది.

ప్రేక్షకాదరణ లెక్కింపు చేపడుతున్న బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అసాధారణ జాప్యం వల్లనే గ్రామీణ ప్రేక్షకుల టీవీ ఆదరణ లెక్కలోకి రావటం లేదని, దీనివలన డిడి చానల్స్ తీవ్రంగా నష్టపోతున్నాయని ప్రసారభారతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్న బార్క్ గ్రామీణ భారతాన్ని పట్టించుకోకుండా నిరాశకు గురిచేస్తోందని ప్రసారభారతి అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు.

నిజానికి బార్క్ ఏర్పడినప్పుడు సగానికి సగం శాంపిల్స్ గ్రామీణ ప్రాంతాలనుంచి తీస్తామని చెప్పుకుంది. అయితే, చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఒక దశలో కొంత మేర పెంచినప్పటికీ ఆశించినంతగా పెంచలేదనే విమర్శలొచ్చాయి. గతంలో టామ్ రేటింగ్స్ ఇస్తున్నప్పుడు దాని కచ్చితత్వం మీద అనేక అనుమానాలుండేయని, అందుకే దాని స్థానంలో బార్క్ వచ్చినా వివక్ష కొనసాగుతూ ఉండటం దురదృష్టకరమని, గ్రామీణ ప్రేక్షకులను పట్టించుకోకుండా ఇచ్చే డేటా కు విశ్వసనీయత ఎలా వస్తుందని ప్రసార భారతి అధికారులు ప్రశ్నించారు. ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూ అప్పట్లో ప్రసార భారతి సీఎవో జవహర్ సర్కార్ బార్క్ సీఈవో పార్థో దాస్ గుప్తా కు తీవ్ర పదజాలంతో లేఖ కూడా రాశారు.

బార్క్ అనుసరిస్తున్న వైఖరి వల్ల దూరదర్శన్ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతున్నదని. పైగా గ్రామీణ ప్రేక్షకుల ఆదరణకు సంబంధించిన సమాచారం అందించే విధంగానే తాము బార్క్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారాయన. లాభాపేక్షలేని ప్రసార భారతి తనకు అందాల్సిన కనీస వాటా కూడా అందకపోవటం వలన నష్టపోతున్న విషయాన్ని జవహర్ సర్కార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటిదాకా ఎంతో ఓపికగా ఎదురుచూశామని సర్కార్ ఆ లేఖలో రాశారు. నిజానికి బార్క్ ఏర్పాట్లు చేసుకోవటానికి ఆరు నెలల సమయం సరిపోతుందని కూడా వ్యాఖ్యానించారు.

టామ్ మీద విమర్శలు వెల్లువెత్తినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేటింగ్స్ కమిషన్ సూచనల ప్రకారం మొత్తం 50 వేల శాంపిల్స్ నుంచి సమాచారం సేకరించాల్సి ఉంది. అప్పట్లో టామ్ కేవలం 10 వేల మీటర్లతోనే నడిచేది. పూర్తి స్థాయికి చేరనప్పటికీ క్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతం 60 శాతానికి చేరటాని పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని శాంపిల్స్ పెరుగుతాయని ఆశిస్తున్నారు.పైగా ఈ శాంపిల్స్ వలన మొత్తం ప్రేక్షక సమాచారం, రేటింగ్స్ ధోరణులు సమూలంగా మారిపోయే అవకాశముందని భావిస్తున్నారు. 2015 అక్టోబర్ లో మొదటి సారిగా గ్రామీణ సమాచారం అందుబాటులోకి తెచ్చిన తరువాత ఇది అతిపెద్ద మార్పు.

ఇకనైనా బార్క్ రేటింగ్స్ కచ్చితంగా వస్తాయా? - Telugu Bulletతాజాగా చేసిన మార్పుల అనంతరం బార్క్ రేటింగ్స్ లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకున్న ఇళ్లు, అందులోని వ్యక్తులు, వయోవర్గాలు ఇలా ఉన్నాయి:( అన్ని సంఖ్యలూ వేలల్లో )

వివరాలు దేశం యావత్తూ మెట్రో 10-75 లక్షలు 10 లక్షల లోపు గ్రామీణ ఎపి/తెలంగాణ హైదరాబాద్ 75 లక్షల లోపు గ్రామీణ

ఇళ్ళు 1,83,052 20,252 18,554 45,608 98,639 20,828 2,119 5,862 12,847

వ్యక్తులు 7,79,844 82,327 79,664 1,95,821 4,22,033 77,284 8,322 21,096 47,057

స్త్రీలు 3,78,227 39,918 38,670 95,292 2,04,347 38,037 4,090 10,948 23,049

పురుషులు 4,01,617 42,409 40,994 1,00,528 2,17,686 39,198 4,232 10,958 24,008

2-14 ఏళ్లు 1,92,895 17,670 18,118 46,372 1,10,734 18,094 1,953 4,832 11,309
15-21 ఏళ్లు 1,15,014 10,863 11,243 28,644 64,263 11,200 1,136 3,197 6,868
22-30 ఏళ్లు 1,36,173 15,926 14,345 34,503 71,399 14,425 1,652 4,178 8,596
31-40 ఏళ్లు 1,22,062 14,527 13,077 31,799 62,657 12,782 1,388 3,710 7,684
41-50 ఏళ్లు 94,921 10,327 10,083 24,685 49,167 9,314 930 2,749 5,635
51-60 ఏళ్లు 60,423 6,615 6,588 15,494 31,726 5,788 564 1,660 3,564
61-99 ఏళ్లు 59,017 6,399 6,208 14,323 32,087 5,680 699 1,581 3,400

బార్క్ చేసిన ఈ మార్పుతో గ్రామీణ శక్తి పుంజుకోబోతోంది. భారత బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమ ముఖచిత్రాన్నే మార్చేస్తుందని భావిస్తున్న ఈ సరికొత్త మార్పు ద్వారా తేలిందేమిటంటే పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ భారతంలొనే 17% టీవీ సెట్లు ఎక్కువగా ఉన్నాయని. దీన్ని బట్టి ఉచిత చానల్స్ కు ఎక్కువ ప్రేక్షకాదరణ, అవకాశం ఉంటాయని అర్థమవుతోంది. ఉచిత చానల్స్ కే ప్రకటనల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని కూడా చానల్స్ గ్రహిస్తున్నాయి. అదే సమయంలో ఉచిత చానల్స్ అందించే దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ వేదిక ఫ్రీడిష్ కు సైతం చెప్పుకోదగిన డిమాండ్ పెరుగుతుంది.

గతంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఇళ్ల నిష్పత్తి 50:50 ఉండగా ఇప్పుడది 54:46 కు చేరింది. అంటే, టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య విషయంలో గ్రామీణ ప్రాంతాల వాటా పెరిగింది. మొత్తం 18 కోట్ల 30 లక్షల టీవీ ఇళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 9 కోట్ల 90 లక్షలుండగా పట్టణ ప్రాంతాల్లో టీవీలున్న ఇళ్ల సంఖ్య 8 కోట్ల 40 లక్షలకే పరిమితమైంది. బార్క్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో టీవీలున్న ఇళ్ల సంఖ్య 2013లో 15 కోట్ల 40 లక్షలుండగా అది 19% పెరిగి 2016 ఫిబ్రవరికల్లా 18 కోట్ల 30 లక్షలకు చేరింది.

అదే విధంగా టీవీ అందుబాటు సైతం పెరిగింది. అది 54% నుంచి 64% వరకు పెరిగినట్టు తేలింది. మొత్తంగా భారతదేశంలో టీవీ చూసేవారి సంఖ్య 16% పెరుగుదల నమోదు చేసుకుంది. ఆ విధంగా ఇప్పుడు దేశంలో టీవీ చూసేవాళ్ళ సంఖ్య 78 కోట్లకు చేరింది.
తాజాగా బార్క్ చేసిన మార్పుల కారణంగా అనేకమార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రేక్షకాదరణలో ఒక్కసారిగా పెనుమార్పులు నమోదయ్యాయి. ఇన్ఫొటైన్మెంట్, మ్యూజిక్, యూత్ చానల్స్ లో ఆ మార్పు కీలకంగా కనబడుతోంది. టీవీ చూడటానికి వెచ్చించే సగటు సమయం కూడా గణనీయంగా పెరిగింది. టీవీలున్న ఇళ్లు, ఆ ఇళ్లలో టీవీ చూసేవాళ్ల సంఖ్య కూడా పెరగటం ఈ మొత్తం మార్పుకు కారణమవుతున్నాయి.

ఆ విధంగా చూసినప్పుడు మహారాష్ట్ర, గోవా 2కోట్ల 22 లక్షల టీవీ ఇళ్లతో దేశంలోనే అత్యధిక సంఖ్యలో టీవీ ఇళ్లున్న రాష్ట్రాలయ్యాయి. ఆ తరువాత స్థానం తమిళనాడు, పాండిచ్చేరి కి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు దక్కుతుంది. ఈ రెండు ప్రాంతాల్లో 2 కోట్ల 8 లక్షల టీవీ ఇళ్లున్నాయి. తమిళనాడులో ఉచిత కలర్ టీవీ పథకం కారణంగా రాష్ట్రం చిన్నదైనప్పటికీ ఎక్కువ టీవీలున్నాయి.

మెట్రో నగరాల విహయానికొస్తే, ఢిల్లీ లో అత్యధికంగా 51 లక్షల 88 వేలుండగా, ఆ తరువాత స్థానంలోని ముంబయ్ లో 46 లక్షల 11 వేల టీవీలున్నాయి. ఆ తరువాత స్థానాల్లో కోల్ కతా (31 లక్షల 7 వేలు), చెన్నై (26 లక్షల 87 వేలు), బెంగళూరు ( 25 లక్షల 40 వేలు), హైదరాబాద్ (21 లక్షల 19 వేలు) ఉన్నాయి.

పెరుగుతున్న ఆథిక స్థోమత, పెరుగుతున్న చిన్న కుటుంబాలు ఈ ధోరణికి అద్దం పడుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విడిపోతూ ఉండటంతో పెద్దవాళ్ళు లేని చిన్న కుటుంబాలు పెరిగినట్టు కూదా ఈ సర్వే తేల్చింది. ఉమ్మడి కుటుంబాల సంఖ్య వేగంగా తగ్గిపోతున్నదని, మధ్య తరగతి కుటుంబాల సంఖ్య పెరుగుతున్నదని బ్రాడ్ కాస్ట్ ఇండియా సర్వే విశ్లేషించింది. 2015 నవంబర్ మొదలుకొని 2016 ఫిబ్రవరి వరకు సాగిన ఈ సర్వే దేశంలోనే అతిపెద్ద సర్వేగా బార్క్ ఇండియా సీఈవో పార్థో దాస్ గుప్తా చెబుతున్నారు. 590 జిల్లాలలో సాగిన ఈ సర్వే లో 4,300 గ్రామాలు, పట్టణాలు, 3 లక్షల ఇళ్లు ఇమిడి ఉన్నాయి. లక్షకు పైబడిన పట్టణాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోగా లక్షలోపు మాత్రం వాటి పరిమాణానికి అనుగుణంగా నిష్పత్తి ప్రకారం తీసుకున్నారు.