మ‌హిళ‌ల‌కు రాత్రిపూట రోడ్ల‌పై ప‌నేంటి?

Ramalinga Reddy says women's don't come to roads at night

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మంత్రులు కొంద‌రు ఒక్కోసారి తాము బాధ్య‌త‌గ‌ల ప‌ద‌విలో ఉన్నామ‌న్న విష‌యం మ‌ర్చిపోయి… తోచిన‌రీతిలో మాట్లాడుతూ విమ‌ర్శ‌ల పాల‌వుతుంటారు. క‌ర్నాట‌క హోం మంత్రి రామ‌లింగారెడ్డి కూడా ఇదే తీరులో వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించారు. హోంమంత్రిగా ఆయ‌న ప్ర‌జ‌లంద‌రి ర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షించాల్సిన ప‌ద‌విలో ఉన్నారు. ముఖ్యంగా హోం శాఖ మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టాలి. అయితే రామ‌లింగారెడ్డి మాత్రం త‌న బాధ్య‌త‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌హిళ‌ల‌కు ఉచిత స‌ల‌హాలిస్తున్నారు. అమ్మాయిల‌కు రాత్రిపూట రోడ్ల‌పై ప‌నేంట‌ని ప్ర‌శ్నించి క‌ల‌క‌లం రేపారు. శాస‌న‌మండ‌లిలో మ‌హిళా భ‌ద్ర‌త‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో మాట్లాడుతూ ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అమ్మాయిల‌కు రాత్రిపూట రోడ్ల‌పై ప‌నిఉండ‌దు క‌నుక, ఇక‌పై రాత్రివేళ‌ల్లో బెంగ‌ళూరు రోడ్ల‌మీద వాళ్లు క‌నిపించ‌ద‌కూడ‌ద‌ని మంత్రి వ్యాఖ్యానించారు. రాత్రిపూట ఆఫీసుకు వెళ్తున్న ఓ మ‌హిళ‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ చూపించి ఇలాంటి స‌మ‌యంలో ఆ మ‌హిళ త‌న బంధువుల‌ను తోడుగా తీసుకెళ్లాలి అని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. రామ‌లింగారెడ్డి వ్యాఖ్య‌ల‌పై క‌ర్నాట‌క‌లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

అత్య‌వ‌స‌ర ప‌నిమీద ఎప్పుడో ఒక‌రోజు రాత్రిపూట బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తే మహిళ‌ల‌కు తోడుగా బంధువులో, కుటుంబ స‌భ్యులో వెంట వ‌స్తారు కానీ… రోజూ వెళ్లాల్సిన ఆఫీసుకు తోడు వ‌చ్చేందుకు ఎవ‌రూ సిద్ధంగా ఉండ‌ర‌న్న విష‌యం మంత్రిగారికి తెలియదా… అని మ‌హిళ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు కూడా రామ‌లింగారెడ్డి వ్యాఖ్య‌లను త‌ప్పుబ‌డుతున్నాయి. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం చేత‌కాక‌పోతే ప‌ద‌వినుంచి త‌ప్ప‌కోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. జాతిపిత మ‌హాత్మాగాంధీనేమో… అర్ధరాత్రి ఆడ‌వాళ్లు న‌డిరోడ్డుపై ఒంట‌రిగా, స్వేచ్ఛ‌గా తిరిగిన‌ప్పుడే దేశానికి నిజ‌మైన స్వాతంత్య్రం వ‌చ్చిన‌ట్ట‌ని చెబితే… ఆయ‌న వార‌సులేమో… మ‌హిళ‌లు అస‌లు రోడ్ల‌పై తిర‌గాల్సిన ప‌నేంటి అని ప్ర‌శ్నిస్తూ… దేశం పురోగ‌మ‌న బాట‌లో కాకుండా తిరోగ‌మ‌నంలో సాగుతోంద‌ని నిరూపిస్తున్నారు.