ట్రంప్ ఓ మాన‌సిక రోగి…

kim jong-un comments on Trump

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఉత్త‌రకొరియా, అమెరికా మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఐక్య‌రాజ్య‌స‌మితిలో తొలిసారి ప్ర‌సంగించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్త‌రకొరియాను స‌ర్వ‌నాశ‌నం చేస్తాన‌ని వ్యాఖ్యానించ‌డంపై ఆ దేశం తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తోంది. ట్రంప్ హెచ్చ‌రిక‌ల‌ను ఉత్త‌రకొరియా విదేశాంగ‌మంత్రి కుక్క అరుపుల‌తో పోల్చ‌గా… తాజాగా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్… అమెరికా అధ్య‌క్షుణ్ణి ఓ మాన‌సిక వ్యాధిగ్ర‌స్థుడిగా అభివ‌ర్ణిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ట్రంప్ ను ఉద్దేశించి కిమ్ ప్ర‌త్య‌క్షంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ఇదే తొలిసారి.

ఇన్నాళ్లూ అధికార ప్ర‌తినిధులు, మీడియా, మంత్రుల‌తో మాట్లాడించిన కిమ్… ట్రంప్ ఐరాస ప్ర‌సంగం త‌ర్వాత స్వ‌యంగా ఆయ‌న‌పై తీవ్ర ప‌దజాలంతో విమ‌ర్శ‌ల‌కు దిగారు. ట్రంప్ అరుపుల‌పై ఎప్పుడు స్పందించాలో, ఎలా స్పందించాలో త‌న‌కు బాగా తెలుస‌ని, అమెరికా అధ్య‌క్షుని హోదాలో రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్న ఆయ‌న అందుకు ప్ర‌తిగా విలువైన వాటిని కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని కిమ్ హెచ్చ‌రించారు. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై త‌మ స్పంద‌న ఆయ‌న ఊహించ‌ని విధంగా ఉంటుంద‌ని కిమ్ చెప్పారు. ఉత్త‌ర‌కొరియా జోలికొస్తే అమెరికా త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. అటు ఇటీవ‌ల హైడ్రోజ‌న్ బాంబు విజ‌య‌వంతంగా ప‌రీక్షించి ప్ర‌పంచ దేశాల‌ను బెంబేలెత్తించిన ఉత్త‌ర‌కొరియా మ‌రో హైడ్రోజ‌న్ బాంబును ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంపైకి ప‌రీక్షించేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని ఆ దేశ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

ఇదే జ‌రిగితే… అమెరికా ఆ దేశంపై మ‌రిన్ని ఆంక్ష‌లు విధించాల‌ని ఐరాస‌లో డిమాండ్ చేసే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే ఇంధ‌న దిగుమ‌తులు, జౌళ ఉత్ప‌త్తుల దిగుమ‌తుల‌పై భ‌ద్ర‌తామండ‌లి విధించిన క‌ఠిన ఆంక్ష‌ల‌తో ఆ దేశం గడ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. అయినా స‌రే క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌పై కిమ్ వెన‌క్కిత‌గ్గ‌డం లేదు. అభ‌ద్ర‌తాభావం వ‌ల్లే ఉత్త‌రకొరియా ఇలా వ‌రుస క్షిప‌ణి ప్ర‌యోగాలు చేస్తోంద‌ని… ర‌ష్యా, చైనా వంటి దేశాలు వాదిస్తున్నాయి. ఆంక్ష‌లు, రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌కు బ‌దులుగా చ‌ర్చ‌ల ద్వారా అమెరికా ఉత్త‌ర‌కొరియాలో న‌మ్మ‌కం పెంచే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అప్పుడే కిమ్ క్షిప‌ణి ప్ర‌యోగాల‌కు స్వ‌స్తి ప‌లుకుతార‌ని ఆ దేశాలు స‌ల‌హా ఇస్తున్నాయి. మ‌రి ట్రంప్ ఈ మాట‌లు చెవికెక్కించుకుంటారో లేదో చూడాలి.