ద‌లైలామాపై చైనా అక్క‌సు

meeting dalai lama major offence china

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బౌద్ధ మ‌త గురువు ద‌లైలామాపై చైనా మ‌రోసారి అక్క‌సు ప్ర‌ద‌ర్శించింది. ఏ దేశ‌మైన ద‌లైలామాకు ఆతిథ్యం ఇవ్వ‌డాన్ని, విదేశీ నేత‌లు ఆయ‌న‌తో స‌మావేశం కావ‌డాన్ని తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తామని చైనా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. దలైలామా ఓ వేర్పాటువాది అని, టిబెట్ ను చైనా నుంచి వేరుచేసేందుకు ఆయ‌న ప్రయ‌త్నిస్తున్నార‌ని ఆరోపించింది. టిబెట్ సార్వ‌భౌమ‌త్వం కోసం త‌న జీవితాన్ని వెచ్చించిన ద‌లైలామాను చైనా మొద‌టినుంచి దోషిగానే చూస్తోంది. టిబెట్ లో చైనా ప్ర‌మేయాన్ని, పాల‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. 1959లో ద‌లైలామా తిరుగుబాటు చేశారు. అది విఫ‌లం కావ‌డంతో స్వ‌దేశాన్ని వ‌దిలి భార‌త్ కు వ‌చ్చారు. అప్ప‌టినుంచి ఆయ‌న భార‌త్ లోనే నివాస‌ముంటున్నారు. మ‌న‌దేశం నుంచే టిబెట్ వ్య‌వ‌హారాల‌ను న‌డిపిస్తున్నారు. టిబెట్ స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి కోసం పోరాడుతున్నారు. ద‌లైలామాను భార‌తీయులు ఎంత‌గానో గౌర‌విస్తారు. ఒక ర‌కంగా చెప్పాలంటే..ఆయ‌న్ను మ‌న‌దేశ పౌరుడిగానే చూస్తారు. ఒక్క మ‌న‌దేశంలోనే కాదు…ద‌లైలామాను ప్రపంచ‌మంతా గౌర‌వ‌భావంతోనే చూస్తుంది. బౌద్ధ మ‌తగురువుగా, శాంతికి ప్ర‌తీక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ద‌లైలామాను అనేక దేశాధినేత‌లు క‌లుస్తుంటారు. ఆయా దేశాల‌కు చెందిన అనేక సంస్థ‌లు ద‌లైలామాను త‌మ సేవాకార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిని చేసుకుంటాయి. కానీ చైనా మాత్రం ద‌లైలామాను శ‌త్రువుగా ప‌రిగ‌ణిస్తుంది. త‌ర‌చూ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉంటుంది. చైనా, భార‌త్ మ‌ధ్య సరిహ‌ద్దు గొడ‌వ‌ల‌తో పాటు..

.ద‌లైలామాకు ఆశ్ర‌యం ఇవ్వ‌డంపైనా ఎన్నోసార్లు వివాదాలు తలెత్తాయి. అయితే ఈ విష‌యంలో చైనా అభ్యంత‌రాల‌ను భార‌త్ ఎప్పుడూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. మ‌న‌దేశంపై చైనా ప‌దే ప‌దే ఆక్రోశం వెళ్ల‌గ‌క్క‌డం వెన‌క దలైలామా అంశం కూడా ఓ కార‌ణం. తాజాగా ఈ విష‌యంలో మ‌రోసారి అక్క‌సు ప్ర‌ద‌ర్శించింది చైనా. . తాము తీవ్రంగా వ్య‌తిరేకించే వ్య‌క్తిని భార‌త్ స‌హా ఇత‌ర దేశాలు అక్కున చేర్చుకోడాన్ని చైనా స‌హించ‌లేక‌పోతోంది. అందుకే హెచ్చ‌రిక‌లు జారీచేసింది. ద‌లైలామా మ‌తం ముసుగు క‌ప్పుకున్న రాజ‌కీయ నేత అని, మాతృభూమిని మోసం చేసి 1959లోనే మ‌రో దేశానికి పారిపోయార‌ని చైనా ఆరోపించింది. పరాయి దేశంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసుకుని టిబెట్ ను చైనా నుంచి వేరుచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. అలాంటి వ్య‌క్తిని ఏదైనా దేశం లేదా సంస్థ‌ల‌కు చెందిన వ్య‌క్తులు క‌ల‌వ‌డాన్ని తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తామ‌ని హెచ్చ‌రించింది. ఆధ్యాత్మిక వేత్త కాబ‌ట్టి ఆయ‌న్ను క‌లుస్తామ‌నే వాద‌న‌ల‌ను తాము అంగీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టంచేసింది. చైనాతో దౌత్య‌ప‌ర‌మైన సంబంధాలు కొన‌సాగించాలంటే…టిబెట్ చైనాలో ఒక భాగ‌మ‌ని విదేశీప్ర‌భుత్వాలు త‌ప్ప‌నిస‌రిగా గుర్తించాల‌ని తేల్చిచెప్పింది. ద‌లైలామా విష‌యంలో ప్ర‌పంచ‌దేశాల‌న్నింటినీ చైనా హెచ్చ‌రించిన‌ట్టు క‌నిపిస్తున్నా…నిజానికి ఈ వ్యాఖ్య‌లు భార‌త్ ను ఉద్దేశించి చేసిన‌వే అని అంత‌ర్జాతీయ‌ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ద‌లైలామాకు అన్ని విష‌యాల్లో భార‌త్ మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం, ఇటీవ‌ల ద‌లైలామా భార‌త ఈశాన్య రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌డం, డోక్లామ్ స‌రిహ‌ద్దు స‌మ‌స్య వంటి అంశాల నేప‌థ్యంలో చైనా ప‌రోక్షంగా ఈ వ్యాఖ్య‌లు చేసి ఉండొచ్చ‌ని విశ్లేషిస్తున్నారు.