2018లో మూడు లేదా నాలుగు!

Nani Upcoming Movies In 2018

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరుసగా ఏడు విజయాలు తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం కుళ్లుకునేలా చేస్తున్న యువ హీరో నాని ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. డిసెంబర్‌లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఆ సినిమా కూడా నానికి ఖచ్చితంగా విజయంను తెచ్చి పెడుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. అంటే 2017వ సంవత్సరంలో నాని మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడన్న మాట. ఇక వచ్చే సంవత్సరంలో కూడా నాని వరుసగా మూడు లేదా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నాడు.

2018వ సంవత్సరంను నాని ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రంతో ప్రారంభించబోతున్నాడు. వరుసగా రెండు సక్సెస్‌లను అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని ఈ సినిమాను చేస్తున్నాడు. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణార్జునయుద్దం విడుదల కాకుండానే నాగార్జునతో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని నాని ప్రారంభించబోతున్నాడు. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. వేసవి కానుకగా మల్టీస్టారర్‌ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే అశ్వినీదత్‌ ప్రకటించాడు.

వచ్చే సంవత్సరం ఆ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రాన్ని చేసేందుకు నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. త్వరలోనే ఆ సినిమా కూడా ప్రారంభం కాబోతుంది. దసరా లేదా అంతకంటే ముందే ఆ చిత్రాన్ని కూడా నాని విడుదల చేయబోతున్నాడు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉండటంతో చిత్రలహరి తర్వాత మరో చిత్రం కూడా వచ్చే సంవత్సరంలో విడుదల అయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి నాని 2018లో అప్పుడే క్యాలెండర్‌ను భర్తీ చేశాడు.