బెజవాడలో శ్రీవారు … పూజా విశేషాలు

pooja timings vijayawada venkatewshwara swamy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో స్వామివారికి రోజువారీ నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించే విధంగా విజయవాడలో 6 రోజుల పాటు తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

విజయవాడలోని పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9.00 గంటలకు ఏకాంత సేవతో కైంకర్యాలను పూర్తి చేయనున్నారు.

సుప్రభాతం : ఉదయం 6.30 గంటలకు :

తిరుమలలో శ్రీస్వామివారికి జరిగే తొలిసేవ సుప్రభాతం. శయన మండపంలో పట్టుపాన్పుపై శయనించి ఉన్న శ్రీనివాస ప్రభువును వేదపండితులతోనూ, భక్తజనులతోనూ, ఆధ్యాత్మికతత్త్వ విశారదులతోనూ, పాచక-పరిచారక-అధికారులతోనూ, అర్చక స్వాములు పరిశుద్ధాంతఃకరణులై మంత్ర సహితముగ జయవిజయుల అనుజ్ఞతో- 

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||

– అను సుప్రభాత శ్లోకమును పఠించి ద్వారములను తెరచి లోపలకు ప్రవేశించి, భగవంతుణ్ణి ధ్యానించి, విశేష ఉపచారాలను, నవనీతమును నైవేద్యం చేసి సేవించెదరు. దీనిని ‘సుప్రభాత సేవ’ అంటారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయులు ఒకరు ”మేలుకో శృంగార రాయ…..” అంటూ మేల్కొల్పులు పాడతారు. 

తోమాలసేవ, కొలువు : ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు : 

తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను, ఇంకా ఇతర విగ్రహాలను పుష్పమాలలతో, తులసి మాలలతో అలంకరించే కార్యక్రమాన్నే తోమాలసేవ అంటారు. భుజాల మీది నుంచి వేలాడేట్టుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని  ”తోమాల” అంటారు. తొడుత్తమాలై అనే తమిళ పదంతో వచ్చిన మాట ‘తోళ్‌మాల’. తొడుత్తమాల అంటే పై నుంచి క్రిందకు వేలాడు మాల అని అర్థంలో తోళ్‌ మాలై అని పేరు వచ్చింది.

అయితే సాయంత్రం పూట జరిగే తోమాలసేవ మాత్రం ఏకాంతంగా జరుగుతుంది. ఎవ్వరూ పాల్గొనడానికి వీలు లేదు. ఏకాంగి కాని లేదా జియ్యంగారలు పూల అరనుంచి సిద్ధం చేసిన పూలమాలలను తీసికొనివచ్చి అర్చకులకు అందిస్తూ ఉండగా అర్చకులు శ్రీవారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలల్ని అలంకరిస్తారు. ఈ సేవ సుమారు 30 నిమిషాలసేపు జరుగుతుంది. 

తోమాల సేవ అనంతరం స్నపన మండపంలో బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తికి కొలువు జరుగుతుంది. ఆ సమయంలో ఆనాటి తిథి నక్షత్రాది వివరాలతో పంచాంగ శ్రవణం జరిగిన తరువాత ముందురోజు హుండీ ఆదాయ వ్యయాలు, అన్నదాతల పేర్లు అన్నింటినీ స్వామివారికి నివేదిస్తారు. 

అర్చన : ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు 

భగవత్‌శక్తి దినదినాభివృద్ది కావడానికి గాను చేసే ప్రధాన ప్రక్రియ ఆగమశాస్త్రోక్త ‘అర్చన’. ఈ అర్చనలో ఆవాహనాదిగా అనేక ఉపచారములు చోటు చేసుకుంటాయి. అనేక మంగళకరములైన ఓషధి ద్రవ్యములతోనూ, అనేక పుష్పములతోనూ, తులసి మొదలగు పత్రములతోనూ ఈ అర్చన జరుపబడుతుంది. ధ్రువాది పంచమూర్తులకు, పరిషద్దేవతాగణాలకు, లోకపాల-అనపాయిను లకు ఈ అర్చన జరుపబడుతుంది. ఈ అర్చనల్లో సహస్రనామాలతో, అష్ణోత్తరనామాలతో, కేశవాది ద్వాదశ నామాలతో పూజ జరుప బడుతుంది. పురాణంలో చెప్పబడ్డ శ్రీవేంకటేశ్వర సహస్రనామావళి, అష్టోత్తర శతనామావళి, లక్ష్మీచతుర్వింశతి నామావళితో ప్రతి నిత్యం అర్చన జరుగుతుంది. ఈ అర్చన లోకక్షేమార్థం, సర్వజన సుభిక్షార్థం, సమస్త సన్మంగళావాప్త్యర్థం జరుపబడుతుంది. 

నివేదన, శాత్తుమొర : ఉదయం 8.45 నుంచి 9.00 గంటల వరకు

అర్చన తరువాత గర్భాలయంలో శ్రీస్వామివారికి, ఇతర మూర్తులకు నివేదన జరుగుతుంది. లడ్డూలు, వడలు, దధ్యోదనం, పులిహోర, పొంగళ్లు తదితర ప్రసాదాలను నివేదిస్తారు. తొలి నివేదనను మొదటి గంట, మధ్యాహ్నం నివేదనను రెండవ గంట, రాత్రి నివేదనను మూడవ గంట లేదా రాత్రి గంట అంటారు.

నివేదన తరువాత వైష్ణవాచార్య పురుషులు స్వామివారి సన్నిధిలో దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. దీన్నే శాత్తుమొర అంటారు. అనంతరం శ్రీవైష్ణవాచార్యులందరూ రామానుజులకు నివేదన అయిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు.

సహస్రదీపాలంకారసేవ : సాయంత్రం 5.45 నుంచి రాత్రి 6.30 గంటల వరకు

సహస్రదీపాలంకారసేను ఊంజల్‌ సేవ అని కూడా అంటారు. శ్రీదేవి, భూదేవితో కూడిన మలయప్పస్వామి ఊరేగింపుగా వచ్చి సహస్రదీపాలు వెలుగుతుండగా మధ్యలో వయ్యారంగా ఉయ్యాల ఊగుతూ చక్కని వేద మంత్రాలను, పాటకచేరీని, నాదస్వర కచేరీని ఆలకించి నక్షత్ర హారతి, కర్పూరహారతిని గ్రహిస్తాడు. ఇది ఆహ్లాద కరమైన చల్లని సాయంసంధ్యా వేళ జరుగుతుంది. భక్తులు స్వామిని దర్శించి తరించివారి జన్మచరితార్థం చేసుకుంటారు.

సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.15 గంటల వరకు పి.డబ్యు.డి.గ్రౌండ్స్‌ చుట్టూ స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. 

ఏకాంతసేవ :  రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు

స్వామికి జరుగు నిత్యోత్సవాలలో చివరిది ‘ఏకాంత సేవ’. స్వామి దేవేరులతో నిద్రకు ఉపక్రమించుటను ఏకాంత సేవ అంటారు. షట్కా లార్చన యందు అర్ధరాత్రి పూజ చివరి అంశం. పరివార దేవతలకు ఆవాహన చేయబడిన శక్తులను తిరిగి మూలమూర్తి వద్దకు పంపి విగ్రహములకు కలిగిన శ్రమను పోగొట్టుటకై ఈ ఏకాంత సేవను ఆగమ శాస్త్ర రీత్యా చేస్తారు. పాలు- పండ్లు స్వామివారి వద్ద ఉంచి అర్చామూర్తిని మంచంపై శయనింపచేయుట ఇందు ప్రధాన ప్రక్రియ. తాళ్లపాక వంశీయులు ఒకరు జోలపాట లేదా లాలిపాట గానం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో తరిగొండవారి తరఫున హారతి పళ్లెం వస్తుంది.

”మంచస్థం మధుసూదనం’ అను ప్రమాణ రీత్యా మంచంపై శయనించి ఉన్న మధుసూదనుని యొక్క దర్శనం సర్వపాపహరణంగా ఆగమగ్రంథాలలో చెప్పబడింది. 

శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవకు అపూర్వ స్పందన

శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా శ్రీవారి నమూనా ఆలయంలో మొదటి రోజైన మంగళవారం ఉదయం శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధనసేవ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు వేడుకగా జరిగింది.

అష్టదళాలతో కూడిన108 బంగారు కమలాలతో మూలవిరాట్టుకు జరిగే అర్చన కార్యక్రమమే అష్టదళ పాదపద్మారాధన. ఇందులో భాగంగా బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు.