గరుడవేగ… తెలుగు బులెట్ రివ్యూ

PSV Garuda Vega Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    రాజశేఖర్, సన్నీలియోన్ ,పూజా  కుమార్ ,శ్రద్ధాదాస్ ,కిషోర్ 

నిర్మాతలు  :  కోటేశ్వర రాజు , మురళి శ్రీనివాస్ 
దర్శకత్వం :  ప్రవీణ్  సత్తార్ 

మ్యూజిక్ డైరెక్టర్ :  శ్రీ చరణ్  పాకల

సినిమాటోగ్రఫీ :  అంజి 

ఎడిటర్ :  ధర్మేంద్ర  కాకరాల 

ప్రతి ఒక్కరి జీవితంలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితులు ఎప్పుడోకప్పుడు ఎదురు అవుతాయి. ఆ పరిస్థితికి కొందరు బేజారు ఎత్తితే ఇంకొందరు తనలోని సర్వశక్తుల్ని కూడదీసుకుని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు హీరో రాజశేఖర్ కూడా అలాంటి పరిస్థితిలోనే గరుడ వేగ సినిమా చేశారు. అయితే ఆయన నిర్ణయానికి తగ్గట్టు నిర్మాత శ్రీనివాస రాజు, దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ వరంలా ఆయనకి దొరికారు. ఇక జీవిత అండ ఎలాగూ ఉంటుంది. ఎందరు వున్నా చేస్తున్న సినిమాలో కంటెంట్ ఉండాలి. ఒక్కోసారి మంచి కంటెంట్ వున్నా దాన్ని మార్కెటింగ్ చేయడంలో తడబడొచ్చు. లేదా పబ్లిసిటీ విషయం,రిలీజ్ డేట్ ఏదో ఒకటి సమస్య కావొచ్చు. కానీ ట్రైలర్ తో ఒక్కసారిగా గరుడ వేగ మీద అంచనాలు పెరిగాయి. దీంతో అన్ని హర్డిల్స్ దాటుకుని థియేటర్స్ ముందుకు వచ్చిన ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ…

శేఖర్ ( రాజశేఖర్ ) ఓ నిజాయితీ కలిగిన nia అధికారి. నిత్యం డ్రగ్స్, అక్రమ ఆయుధాలకి సంబంధించిన కేసుల విచారణలో బిజీ గా ఉంటాడు. దీంతో తనకి సరైన సమయం కేటాయించడం లేదని ఆయన భార్య స్వాతి ( పూజ కుమార్ ) రగిలిపోతుంటుంది. అలాంటి సమయంలో శేఖర్ కి ఓ ముఖ్యమైన కేసు అప్పగిస్తాడు పై అధికారి. ఓ బ్లాస్టింగ్ కేసుగా అది శేఖర్ దగ్గరికి వస్తుంది. దాన్ని చేధించుకుంటూ వెళ్లేసరికి అనూహ్యమైన పరిణామాలు ఎదురు అవుతాయి. ఈ కేసు వెనుక మూల కారణం, అందుకు బాధ్యులైన వ్యక్తులు ఆశ్చర్యం కలిగిస్తాయి. అతి క్లిష్టమైన ఈ కేసుని శేఖర్ ఎలా సాల్వ్ చేసాడు అన్నదే గరుడ వేగ కధ.

విశ్లేషణ …

కధగా చూసినప్పుడు గరుడ వేగ వెరీ సింపుల్ . కానీ కధనంతో ఈ సినిమా స్థాయి పెంచగలనని నమ్మాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తాను ఏదైతే అనుకున్నాడో సినిమా ఫస్ట్ షాట్ నుంచి అదే చూపించాడు. ఓ 15 , 20 ఏళ్ళ కిందట రాజశేఖర్ కి వున్న యాక్షన్ ఇమేజ్ ని వాడుకొనేలా సత్తారు కధనం మీద శ్రద్ధ తీసుకున్నాడు. డార్జీలింగ్ లో తీసిన మొదటి యాక్షన్ ఎపిసోడ్ మొదలుకుని ఫస్ట్ హాఫ్ చివరిలో వచ్చే చార్మినార్ ఎపిసోడ్ దాకా సినిమా ఓ రేసు గుర్రంలా దూసుకెళుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ తెలుగు సినిమాల్లో నిజంగా ఇలా తీస్తారా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి గరుడ వేగ కధకి సెంట్రల్ పాయింట్ ఎప్పుడైతే ప్రేక్షకులకి తెలిసిపోతుందో అప్పటినుంచి కథాగమనం మారిపోతుంది.అప్పటిదాకా భలే సినిమా చూస్తున్నాం అనే మూడ్ లో వున్న ప్రేక్షకుడు మళ్లీ మామూలు సినిమా చుస్తున్నామా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు. అయితే ఆ చిన్నపాటి లోటు గుర్తుకురాకుండా చివరి 20 నిముషాలు ప్రేక్షకుడిని థ్రిల్ కి గురి చేస్తుంది. రాజశేఖర్ కి జీవన్మరణ సమస్య లాంటి సినిమా అనుకున్నప్పటికీ నిజానికి ఇది దర్శకుడు ప్రవీణ్ సత్తారు తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న సినిమా. ప్రవీణ్ సత్తారు ఈ సినిమా తర్వాత కచ్చితంగా ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్ తీయడంలో ప్రవీణ్ టాలెంట్ సూపర్బ్.
             
         హీరో రాజశేఖర్ ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంత చేశారు. నిజానికి ఆయన ఓ పాతికేళ్ళు వెనక్కి వెళ్లారు. యాక్షన్ హీరోగా అప్పుడున్న ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా చేశారు. ఇంత యాక్షన్ వున్న సినిమాని ఓకే చేయడమే ఆయన తీసుకున్న మొదటి ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ లో రాజశేఖర్ గెలిచాడు. పూజాకుమార్, కిషోర్, శ్రద్ధ దాస్, అలీ, పోసాని కృష్ణ మురళి ఇలా అందరూ ఈ సినిమా విలువ పెంచడానికి దోహదపడ్డారు. సినిమా నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తీసేది మొదటి సినిమా అయినప్పుడు ఏ ప్రొడ్యూసర్ కి అయినా కాస్త భయం ఉంటుంది. కానీ ఈ నిర్మాత శ్రీనివాసరాజు కి సినిమా అంటే పిచ్చి అని తేలిగ్గా చెప్పేయొచ్చు. రాజశేఖర్ తో ఈ టైం లో ఇలాంటి సినిమా తీయడం అతని గట్స్ కి నిదర్శనం.
ప్లస్ పాయింట్స్ …
దర్శకుడు
కధనం
యాక్షన్ ఎపిసోడ్స్
హీరో
నిర్మాణ విలువలు 
మైనస్ పాయింట్స్ …
సెకండ్ హాఫ్ లో కొన్ని రొటీన్ సన్నివేశాలు
తెలుగు బులెట్ పంచ్ లైన్ … “గరుడ వేగ “ కి సెకండ్ హాఫ్ లో ఆ స్పీడ్ బ్రేకర్ లేకుంటే ఎక్కడికో వెళ్ళేది.
తెలుగు బులెట్ రేటింగ్ … 3.2/5