పుతిన్ చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది

Putin-say-about-Trump-Behav

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఓ యుద్ధం చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారా…గ‌త అధ్యక్షుల్లానే తానూ ఓ దేశాధినేత‌ను మ‌ట్టుపెట్టాల‌న్న కోరిక‌తో ఉన్నారా…? అమెరికాను ఇంకో యుద్ధం దిశ‌గా న‌డిపించ‌నున్నారా…అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఉత్త‌ర‌కొరియా, అమెరికా మ‌ధ్య చాలా రోజుల నుంచి ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇరుదేశాధినేత‌లూ ఒక‌రినొక‌రు రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు. అగ్రరాజ్యం హోదాలో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అమెరికా కూడా ఉత్త‌ర‌కొరియాకు ఏ మాత్రం తీసిపోకుండా వ్యాఖ్య‌లు చేస్తోంది. అధ్య‌క్షుడు ట్రంప్ ప‌దే ప‌దే ఉత్తరకొరియా ను ఉద్దేశించి అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.  అందుకే అమెరికా ప్ర‌తిప‌క్షాలు ట్రంప్ తీరును త‌ప్పుప‌డుతున్నాయి.
త‌న తెలివిత‌క్కువ వైఖ‌రితో ట్రంప్ మూడో ప్ర‌పంచ‌యుద్ధాన్ని మొదలుపెట్టేలా ఉన్నార‌ని హిల్ల‌రీ క్లింట‌న్ గ‌తంలో విమ‌ర్శించారు. ఇత‌ర నేత‌ల నుంచి సైతం ఇలాంటి అభిప్రాయాలే వ్య‌క్త‌మయ్యాయి. అయినా ట్రంప్ త‌న ప‌ద్ధ‌తి మార్చుకోవ‌డం లేదు. తాజాగా త‌న‌ ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌లో  ట్రంప్ ఉత్త‌రకొరియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అమెరిక‌న్ల‌ను త‌క్కువ అంచ‌నావేస్తే ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని, ఇరాక్, లిబియా మాజీ అధినేత‌ల‌కు ప‌ట్టిన గ‌తే కిమ్ కూ ప‌డుతుందని ట్రంప్ తీవ్రంగా హెచ్చ‌రించారు.  ఉత్త‌ర‌కొరియా రూపొందించే అణ్వాయుధాలు చివ‌ర‌కు వారికే హాని త‌ల‌పెడ‌తాయని విశ్లేషించారు. కిమ్ పాల‌న‌ను ఉత్త‌ర‌కొరియా ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని, ఆ దేశంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొనాలంటే కిమ్ ఆట‌లు క‌ట్టించాల‌ని, దీనికోసం ప్ర‌పంచ దేశాల‌న్నీ కృషి చేయాల‌ని ట్రంప్ పిలుపునిచ్చారు.
అమెరికాను లక్ష్యంగా చేసుకుని కిమ్ అణ్వాయుధాలు రూపొందిస్తున్నార‌ని, కిమ్ పిచ్చిచేష్ట‌ల‌ను అమెరికా ఒంట‌రిగానే ఆప‌గ‌ల‌దని తెలిపారు. చైనా, ర‌ష్యాలు కిమ్ పై ఒత్తిడి తీసుకురావాల‌ని కోరారు. నిజానికి అమెరికాకు భ‌య‌ప‌డే కిమ్ అణ్వాయుధాలు స‌మకూర్చుకుంటున్నార‌ని ర‌ష్యా మొద‌టి నుంచి చెప్తూనే ఉంది. కిమ్ కు తాను స‌ద్దాం హుస్సేన్ లా అవుతాన‌న్న భ‌యం వెంటాడుతోంద‌ని..అందుకే అమెరికాను ఎదుర్కొనేందుకు ఉత్త‌ర‌కొరియాను అణ్వ‌స్త్ర దేశంగా మార్చుతున్నార‌ని, ఈ స‌మ‌స్య‌కు చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని, యుద్ధం వ‌ల్ల కాద‌ని కూడా ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్య‌లు చూస్తే కిమ్ భ‌యం నిజ‌మే అనిపిస్తోంది. యుద్ధాన్ని ఇష్ట‌ప‌డే రిప‌బ్లిక‌న్ల వార‌స‌త్వాన్ని ట్రంప్ కొన‌సాగించే సూచ‌న‌లు క‌నిపిస‌స్తున్నాయి.