నెటిజ‌న్ల‌కు మ‌ళ్లీ దొరికిపోయిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Again Posted Wrong Posting in Twitter
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బ‌హిరంగ స‌భల్లోనూ,  పార్టీ స‌మావేశాల్లోనూ మాట్లాడేట‌ప్పుడు నేత‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఆచితూచి మాట్లాడుతుంటారు. సోష‌ల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేసేట‌ప్పుడు కూడా ఒక‌టికి ప‌దిసార్లు చెక్ చేసుకుంటారు. అయితే కొన్నిసంద‌ర్భాల్లో తెలియ‌కుండానే త‌ప్పులు దొర్లిపోతుంటాయి. సాధార‌ణ వ్య‌క్తులు  త‌ప్పు మాట్లాడినా…పోస్టింగ్ ల్లో పొరాప‌టు ప‌డినా పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. అదే సెల‌బ్రిటీలు క‌నక త‌ప్పు చేసి దొరికిపోతే …ఇక నెటిజ‌న్ల కామెంట్ల‌కు అంతే ఉండ‌దు. ఆ సెల‌బ్రిటీ చేసిన త‌ప్పుడు పోస్టునో..మాట్లాడిన పొర‌పాటుమాట‌నో ప‌ట్టుకుని అదే షేర్ చేస్తూ…విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు.
ఇటీవ‌ల చాలామంది సెల‌బ్రిటీలు ఇలాంటి స‌మ‌స్య ఎదుర్కొంటున్నారు. అయితే అంద‌రికన్నా ఎక్కువ‌గా కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నెటిజ‌న్ల‌కు  దొరికిపోతున్నారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో మొన్న‌టికి మొన్న లోక్ స‌భ స్థానాలు 545 అన‌బోయి 546 అని చెప్పిన రాహుల్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 2019లో కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పోటీచేయాల‌ని భావిస్తున్న రాహుల్ ..ముందు లోక్ స‌భ‌లో ఎన్నిస్థానాలు ఉన్నాయో తెలుసుకోవాలంటూ నెటిజన్లు హిత‌వు ప‌లికారు. అంత‌కుముందు బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లోనూ రాహుల్ ఇలానే పొరపాటు వ్యాఖ్య‌లు చేశారు.
తాజాగా రాహుల్  ట్విట్ట‌ర్ లో చేసిన ఓ పోస్టులోనూ త‌ప్పులు దొర్లాయి. ఐఏఎఫ్ మాజీ అధిప‌తి, మార్ష‌ల్ అర్జున్ సింగ్ చ‌నిపోవ‌డంతో ఆయ‌న‌కు రాహుల్ ట్విట్ట‌ర్ లో నివాళుల‌ర్పించారు. ఆ పోస్టులో అర్జున్ సింగ్ హోదాను రాహుల్ త‌ప్పుగా పేర్కొన్నారు. ఎయిర్ మార్ష‌ల్ అర్జున్ సింగ్ మ‌ర‌ణం కోలుకోలేనిద‌ని, భార‌త్ నిజ‌మైన హీరోను కోల్పోయింద‌ని, ఆయ‌న మృతికి ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాన‌ని రాహుల్ ట్వీట్ చేశారు. అయితే రాహుల్ ఎయిర్ మార్ష‌ల్ గా పేర్కొన్న అర్జున్ సింగ్ నిజానికి మార్ష‌ల్. ఎయిర్ మార్ష‌ల్ కు త్రీ స్టార్ ర్యాంకు హోదా, మార్ష‌ల్ కు ఫైవ్ స్టార్ ర్యాంకు హోదా ఉంటాయి. ఈ తేడా తెలియ‌ని రాహుల్ గాంధీ మార్ష‌ల్ అయిన అర్జున్ సింగ్ ను ఎయిర్ మార్ష‌ల్ గా పేర్కొన్నారు. తప్పును గ్ర‌హించి వెంట‌నే ఆయ‌న త‌న ట్వీట్ ను స‌రిచేసుకున్నా…అప్ప‌టికే చాలామంది నెటిజ‌న్లు రాహుల్ త‌ప్పుడు ట్వీట్ ను షేర్ చేసుకూంటూ ఆయ‌న‌పై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.