దూరదర్శన్ సీన్ మారబోతుందా?

shashi shekhar appointed new CEO of Prasar Bharati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీడియా వ్యవహారాల్లో చాలా శ్రద్ధగా ఉండే మోదీ ప్రభుత్వం ప్రసార భారతి కొత్త సిఇఒ ఎంపిక ద్వారా మరోసారి ఆ విషయాన్ని ఋజువు చేసుకుంది. సంప్రదాయాన్ని కాదని మొదటిసారి ఐఎఎస్ ఆఫీసర్లకు కాకుండా ఒక కార్పోరేట్ పర్సనాలిటీకి ప్రసార భారతి పదవి పగ్గాలు అప్పగించింది. వెంపటి శశి శేఖర్‌ని ప్రసార భారతి సిఇఒగా నియమిస్తూ ఉపరాష్ట్రపతి నాయకత్వంలోని త్రిసభ్య కమిటి నిర్ణయం తీసుకుంది. సంఘ్ సానుకూల మీడియా సంస్థగా పేరున్న నీతి – డిజిటల్ సంస్థకు నాయకత్వం వహించిన శశి శేఖర్ ఇకపై పూర్తిస్థాయిలో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలపై దృష్టి పెట్టబోతున్నారు.

శశి శేఖర్‌ను ప్రసార భారతి సిఇఒగా నియమించడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. మామూలుగా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఇచ్చే పదవి మొదటిసారి ప్రైవేటు వ్యక్తికి ఇచ్చారు. అది కూడా ఏకంగా ఐదు సంవత్సరాల టెర్మ్. వెంపటి శశి శేఖర్ తన సొంత వెంచర్ అయిన నీతి డిజిటిల్ స్థాపించకముందు 16 ఏళ్ళ పాటూ ఇన్ఫోసిస్‌లో పనిచేశారు. ఇన్ఫోసిస్ ఛీఫ్ ఆర్కిటెక్ట్‌గా ఉండేవారు. 2016 ఫిబ్రవరిలో శశి శేఖర్‌ని ప్రసార భారతి బోర్డులోకి తీసుకున్నారు.

మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రసార భారతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే ప్రసార భారతి ఛైర్మన్‌గా ఎ సూర్య ప్రకాశ్ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి సిఇఒ జవహర్ సర్కార్ వాలంటరి రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచీ, అంటే ఏడు నెలలుగా ఆ పదవి ఖాళీగానే ఉంది. ప్రసార భారతి బోర్డులో ఫైనాన్స్ మెంబరుగా ఉన్న రాజీవ్ సింగ్ ఇప్పటి వరకూ ఇంచార్జి సిఇఒగా ఉన్నారు. ఇకపై శశిశేఖర్ పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలు చూస్తారు.

రొటీన్ బ్యూరోక్రాట్‌ని కాదని టెక్నోక్రాట్‌ని, అందునా కార్పోరేట్ మేనేజ్మెంట్, టెక్నాలజీ కన్సల్టెంట్, డిజిటల్ మీడియా వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని ప్రసార భారతికి సిఇఒగా చేయడం వెనుక కచ్చితంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. రాజకీయంగా ఆ లక్ష్యాలు ఎలా ఉన్నా, సాంకేతిక పరంగా, గుణాత్మకంగా మాత్రం ప్రసార భారతిలో మార్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శశి శేఖర్ ప్రొఫైల్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఆయన గతంలో ఇన్ఫోసిస్‌లో ఉత్తర అమెరికాలో డిజిటల్ ఇన్నోవేషన్, ప్రోడక్ట్ స్ట్రేటజీల విభాగాలకు నాయకత్వం వహించారు. డిజిటల్ మీడియా రంగంలో అతని పేరిట ఈ రంగంలో రెండు పేటెంట్లు ఉన్నాయి. భారతదేశంలో టీవీ మీడియా, డిజిటల్ మీడియాలపై పలు పుస్తకాలు కూడా రాశారు శశి శేఖర్.

దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలను ఆదరించే ప్రేక్షకులు లేని సమయంలో రొటీన్‌కి భిన్నంగా కొత్త ప్రయత్నం చేయడం వెనుక కేంద్రం ఉద్దేశం ఏంటా అన్న చర్చ జరుగుతోంది. డిజిటల్ మీడియా గత ఎన్నికల్లో బీజేపీకి చాలా ఓట్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రసార భారతిని కూడా తమకు అనుకూలంగా ఎలా మలచుకోవాలా అనే ఆలోచనలో పడ్డ బీజేపీ ఈ కొత్త స్టెప్ వేసింది. మరోవైపు, త్వరలోనే దూరదర్శన్ కొన్ని కొత్త చానళ్లను ప్రారంభించబోతోందనీ, డీడీ లుక్ ఎండ్ ఫీల్ మార్చే పనిలో మోదీ సర్కార్ ఉందనీ అంటున్నారు. మరి శశిశేఖర్ డీడీని మారుస్తారా? డీడీయే శశిశేఖర్‌ని మారుస్తుందో చూడాలి!

-MS Reddy

మరిన్ని వార్తలు:

నంద్యాలలో చంద్రబాబు ని ఏకేసిన జగన్…

విక్రమ్ గౌడ్ అరెస్ట్.

టీటీడీ ఛైర్మన్ గా కొత్త పేరు.