స్పైడర్… తెలుగు బులెట్ రివ్యూ

Spyder Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ , ఎస్ జె సూర్య, భరత్ 
నిర్మాత :     మధు, నల్లమలపు బుజ్జి , మంజుల 
దర్శకత్వం :    ఎ ఆర్ మురుగదాస్ 
మ్యూజిక్ డైరెక్టర్ :  హర్రిస్ జైరాజ్ 
ఎడిటర్ :      శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ :  సంతోష్ శివన్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో 120 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అనగానే ఎక్కడలేని ఆసక్తి . జాతీయ స్థాయిలో కూడా గజని లాంటి భారీ హిట్ ఇచ్చిన మురుగదాస్ తెలుగు,తమిళ భాషల్లో తీస్తున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే వున్నాయి. అయితే సినిమాకి సంబంధించి కీలక విషయాలు ఏమీ బయటకు రాకుండా మురుగదాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది కూడా స్పైడర్ మీద ఓ రకమైన ఉత్కంఠ పెరగడానికి కారణం అయ్యింది. ఒక్క మహేష్ బాబు అభిమానుల్లోనే కాదు యావత్ సినీ పరిశ్రమ లో కూడా మహేష్, మురుగదాస్ కాంబినేషన్ గురించి ఆసక్తి నెలకొంది . తాజాగా విడుదల అయిన స్పైడర్ ఆ అంచనాలకు తగ్గట్టు వుందో, లేదో చూద్దామా.

కథ…

స్పైడర్ లో కధగా చెప్పాలంటే చాలా సింపుల్. దారి తప్పిన ఓ కరుడుగట్టిన క్రిమినల్ మారణకాండ సృష్టిస్తుంటాడు. అతని తమ్ముడు కూడా అదే దారిలో ఉంటాడు. వాళ్ళు బాల్యం అందుకు కారణం అవుతుంది.నిలువెల్లా కౄరత్వంతో, క్రిమినల్ ఆలోచనలతో రగిలిపోయే వారిని పట్టుకోడానికి ఓ ఇంటలిజెన్స్ అధికారి తెలివిగా ఏమి చేసాడు అన్నదే ఈ సినిమా కధ. హీరో,విలన్ మైండ్ గేమ్ ప్రధానంగా ఈ సినిమా కధ నడుస్తుంది.

విశ్లేషణ …

భారతీయ సినిమా స్థాయిని పెంచడానికి గట్టి ప్రయత్నం చేస్తున్న దర్శకుల్లో మురుగదాస్ ఒక్కరు. తన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక మంచి విషయం అంతర్లీనంగా చెప్పడానికి ప్రయత్నించే మురుగదాస్ ఈ సినిమాకి కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. మురుగదాస్ చెప్పే కధల్లో కేవలం ఓ సమస్యని హైలైట్ చేయకుండా వాటి మూలాల్ని కూడా టచ్ చేస్తాడు. పరిష్కారం గురించి కూడా ఆలోచిస్తాడు.చెబుతాడు. ఇంత బాధ్యతాయుతమైన దర్శకుడు చేతిలో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ పడ్డాడు. అయినా మురుగదాస్ ఎక్కడా స్టార్ ని కాకుండా కధ లోని పాయింట్ చెప్పడానికే ప్రెధాన్యం ఇచ్చాడు. అయినా ఈ సినిమా ఒప్పుకున్న మహేష్ ని ఒప్పుకుని తీరాల్సిందే.

అసలు క్రిమినల్ ఆపరేషన్స్ ని కంట్రోల్ చేయడానికి ఐబీ అధికారిగా శివ అనుసరించే పద్ధతుల ద్వారా టెక్నాలజీ మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో అర్ధం అవుతుంది. ఇక హాస్పిటల్ ఫైట్, భరత్ ని పట్టుకునే సన్నివేశం, హీరో, విలన్ ఒకరినొకరు హెచ్చరించుకునే సన్నివేశం, లాంకో హిల్స్ ఎపిసోడ్, మహిళల కోసం ఓ గేమ్ షో ఇవన్నీ ఐబీ అధికారి ఇంటలిజెన్స్ కి అద్దం పడతాయి. ఇలాంటి సీన్స్ రాసుకున్న మురుగదాస్ ని మెచ్చుకోకుండా ఉండలేము. ఇక ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ సూపర్ అనుకోవాలి. ఇక విలన్ వెనుక జీవితాన్ని కూడా చూపించిన మురుగదాస్ తాను ఎంత లోతుగా సినిమా గురించి, అందులో పాత్రల గురించి ఆలోచిస్తాడో చెప్పకనే చెప్పింది.

మహేష్ ఈ సినిమా కి ఆయువుపట్టు. ఇప్పటిదాకా మనం చూసిన మహేష్ వేరు. ఈ సినిమాలో మహేష్ వేరు. ప్రతి సీన్ లో ఐబీ అధికారి శివ కనిపిస్తాడు తప్ప ఎక్కడా మహేష్ గుర్తుకు రాడు. సహజంగా ఇలాంటి స్క్రిప్ట్స్ ని స్టార్ హీరోలు ఒప్పుకోవడం అరుదు. కానీ మహేష్ ఆ ట్రెండ్ ని బ్రేక్ చేయడానికి మొదటి నుంచి పని చేస్తూనే వున్నాడు. ఇప్పుడు స్పైడర్ ఓ కొత్త తరహా సినిమా కోసం మహేష్ చేసిన బెస్ట్ ఎఫర్ట్ అనుకోవచ్చు.

మహేష్ కి నటన పరంగా గట్టి పోటీ ఇచ్చిన వారిలో విలన్ రోల్ వేసిన సూర్య ముందుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడిగా ఓ సినిమా చేసే అవకాశాన్ని వదులుకుని మరీ సూర్య ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడంటేనే అతనికి ఈ భైరవుడు పాత్ర ఎంతగా నచ్చిందో తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టే సూర్య పెర్ఫర్మ్ చేసాడు. సినిమా అయిపోయాక కూడా కొన్నాళ్ళు సూర్య పాత్ర , నటన మనల్ని వెంటాడుతాయి. ఇక భరత్, రకుల్, ప్రియదర్శి కూడా తమ తమ పాత్రలకి తగ్గట్టు చేశారు.

ఇక ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. ఈ మాట చెప్పడానికి నాలుగు పిల్లర్స్ కారణం. ఫోటోగ్రఫీ లో సంతోష్ శివన్ ఎందుకు దిగ్గజం అని ఇండస్ట్రీ చెప్పుకుంటుందో స్పైడర్ చూస్తే అర్ధం అవుతుంది. ఆయన కెమెరా కళ్లలోనుంచి స్పైడర్ ని చూడడం ఓ వండర్. ఇక హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఈ సినిమా స్థాయిని పెంచింది. ఇక ఎడిటింగ్ చేసిన శ్రీకర్ ప్రసాద్, ఫైట్స్ చేసిన పీటర్ హాయిన్స్ ఈ సినిమాకి మిగిలిన రెండు పిల్లర్స్.

ప్లస్ పాయింట్స్ …
మహేష్ ,సూర్య, భరత్ నటన
మురుగదాస్ దర్శకత్వం
సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ
హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్
శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్
పీటర్ హాయిన్స్ ఫైట్స్

మైనస్ పాయింట్స్ …

అక్కడక్కడా తమిళ వాసనలు
భరత్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లెంగ్త్
తెలుగు బులెట్ పంచ్ లైన్ …స్పైడర్ ఓ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా
తెలుగు బులెట్ రేటింగ్ …3 .25 / 5 .