వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం…

Sri Padmavathi Amman Chariot Celebration

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం 7.00 గంటలకు వృశ్చిక లగ్నంలో ప్రారంభమైన రథం 9.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. పిల్లల నుండి పెద్దల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి.

 శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.  

Sri Padmavathi Amman Chariot Celebration

వాహనసేవ అనంతరం మధ్యాహ్నం 1.00  నుండి 2.30 గంటల వరకు రథమండపంలో  అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. 

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, చంద్రగిరి ఎమ్‌ఎల్‌ఏ శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాధాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అశ్వవాహనంపై లోక రక్షణి

అలాగే రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో అమ్మవారు విహరించనున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ సాక్షిగా అశ్వం నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవాభాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలిదోషాలను తొలగిస్తుంది.

బంగారు చీరలో అమ్మవారి దర్శనం

Sri Padmavathi Amman Chariot Celebration

పంచమితీర్థం పర్వదినాన అమ్మవారి మూలమూర్తికి అలంకరించే బంగారు చీరను ముందుగానే  బుధవారం ఉదయం అలంకరించారు. బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమితానందాన్ని పొందారు. కాగా బుధవారం, గురువారం బంగారు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Sri Padmavathi Amman Chariot Celebration