స‌స్పెన్స్ వీడేది చంద్ర‌బాబు వ‌చ్చాకే…

tdp-leader-motkupalli-narasimhulu-fires-on-revanth-reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్ పై స‌స్సెన్స్ కొన‌సాగుతోంది. రెండు రోజులుగా ఆయ‌న కాంగ్రెస్ లో చేర‌నున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారం.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చేదాకా కొన‌సాగ‌నుంది. రాష్ట్ర విభ‌జ‌న‌, 2014 ఎన్నిక‌లు త‌ర్వాత తెలంగాణ‌లో టీడీపీని అంతటా తానై న‌డిపించిన రేవంత్ రెడ్డి ఏడాది తిర‌గ‌క‌ముందే.. ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. అప్ప‌టికే రేవంత్ రెడ్డి టీడీపీలో పోషిస్తున్న పాత్ర‌పై ఎర్ర‌బెల్లి వంటి సీనియ‌ర్లు అసంతృప్తి తో ఉన్నారు. ఓటుకు నోటు త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాలు తెలంగాణ‌లో టీడీపీని మ‌రింత బ‌ల‌హీన‌ప‌రిచాయి. ఎర్ర‌బెల్లి వంటి సీనియ‌ర్లు పార్టీని వీడారు. దీంతో తెలంగాణ‌లో టీటీడీపీ ఉనికి నామ‌మాత్ర‌మైంది. ఈ నేప‌థ్యంలోనూ రేవంత్ రెడ్డి కేసీఆర్ కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు. అయితే అనూహ్యంగా కేసీఆర్, చంద్ర‌బాబు మ‌ధ్య విభేదాలు స‌మ‌సిపోయిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. పొరుగు రాష్ట్రాల చెలిమి పేరుతో చంద్రులిద్ద‌రూ పాత విభేదాలు మ‌రిచి ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ చెలిమికి త‌గ్గ‌ట్టుగా కేసీఆర్ పై ఆంధ్ర‌లో వ్య‌తిరేక‌భావం తొల‌గిపోయింది. సాటి తెలుగు రాష్ట్రం సీఎంను ఆంధ్ర‌ప్ర‌జ‌లు స‌హృదయంతో గౌర‌వించ‌డం ఆరంభించారు. లోప‌ల ఎలా ఉన్నా…పైకి మాత్రం రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు, ఆ త‌ర్వాత కొన్నాళ్లూ సాగిన విద్వేషాలు తొల‌గిపోయినట్టు క‌నిపిస్తోంది. ప‌రిటాల శ్రీరామ్ పెళ్లికి కేసీఆర్ అనంత‌పురం వ‌చ్చిన‌ప్పుడు …టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లంతా ఆయ‌న‌ను రాజ‌కీయ మిత్రుడిలానే ట్రీట్ చేశారు.

ఈ త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు బ‌య‌లుదేరాయి. టీడీపీ మౌత్ పీస్ గా చెప్పుకునే ఆంధ్ర‌జ్యోతిలోనే ఈ ర‌క‌మైన సంకేతాలు వెలువ‌డ్డాయి. తెలంగాణ‌లో టీడీపీ పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డ‌డం, అటు ఏపీ నేత‌లు కేసీఆర్ ను మిత్రుడిగా చూస్తుండ‌డంతో తొలినుంచీ కేసీఆర్ ను వ్య‌తిరేకిస్తున్న రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో ప‌డ్డారు. ఓటుకు నోటు కేసు త‌ర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకున్నారు. ఎప్ప‌టికైనా కేసీఆర్ ను గ‌ద్దె దింప‌డ‌మే ఆయ‌న ధ్యేయం. జైలుకు వెళ్తూ ఆయ‌న అలా ప్ర‌తిజ్ఞ కూడా చేశారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆయ‌న ల‌క్ష్యం నెర‌వేరే అవ‌కాశం క‌న్పించ‌డం లేదు. తెలంగాణ‌లో తిరుగులేని బ‌లం చెలాయిస్తున్న కేసీఆర్ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పాలంటే క్షేత్ర‌స్థాయి నుంచి గట్టిపోరాటాలు చేయాలి. కానీ అలా టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా పోరాడే స్థితిలో, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను నిల‌దీసే ఉద్దేశంలో తెలంగాణ టీడీపీ లేదు. దీంతో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఆయ‌న పావులు క‌దిపారు.

ఢిల్లీ నుంచి వ‌చ్చిన త‌రువాత నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో రేవంత్ తాను పార్టీ మార‌డానికి గ‌ల కార‌ణాలను ప‌రోక్షంగా వెల్ల‌డించారు. కేసీఆర్ ను మ‌ళ్లీ సీఎం చేయ‌డానికి తాము సిద్ధంగా లేమ‌ని, ఏపీ నేత‌లు కేసీఆర్ తో అంట‌కాగ‌టం, తెలంగాణ‌లో టీడీపీకి న‌ష్టం క‌లిగిస్తుంద‌ని స్ప‌ష్టంచేశారు. రేవంత్ మీడియాతో నిర్వ‌హించిన ఈ ఇష్టాగోష్టి త‌ర్వాత ఆయ‌న దాదాపు టీడీపీని వీడిన‌ట్టే అని అంతా ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో జ‌రిగిన పొలిట్ బ్యూరో, కేంద్ర క‌మిటీ స‌మావేశానికి హాజ‌రై అంద‌రికీ షాకిచ్చారు రేవంత్. అస‌లు ఈ స‌మావేశం ఏర్పాటుచేసిందే..

రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం గురించి చ‌ర్చించ‌డానికి. కానీ..ఆయ‌నే స‌మావేశానికి హాజ‌రు కావ‌డంతో మొద‌ట ఏం చేయాలో టీటీడీపీ నేత‌ల‌కు అర్ధం కాలేదు. అయితే ముసుగులో గుద్దులాట అన‌వ‌స‌రం అని భావించి నేత‌లు డైరెక్ట్ గా విష‌యంలోకి దిగారు. రాహుల్ ను క‌ల‌వ‌డం, ఏపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం వంటి విష‌యాల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కానీ వాట‌న్నింటికీ రేవంత్ ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌కుండా… చంద్ర‌బాబు ద‌గ్గ‌రే వివ‌ర‌ణ ఇస్తాన‌ని చెప్ప‌డంతో మోత్క‌ప‌ల్లి న‌ర‌సింహులు, అర‌వింద్ కుమార్ గౌడ్ వంటి నేత‌లు స‌మావేశం నుంచి వాకౌట్ చేశారు. పొలిట్ బ్యూరో స‌మావేశంలో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు న‌చ్చ‌ని టీటీడీపీ నేత‌లు ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల దాడిచేశారు.

రేవంత్ రెడ్డి వ‌ల్లే తెలంగాణ‌లో టీడీపీ బ‌ల‌హీన‌ప‌డింద‌ని, ఎకాఎకి ముఖ్య‌మంత్రి కావాల‌న్న‌ది ఆయ‌న ల‌క్ష్య‌మ‌ని, ఆయ‌న వ్య‌వ‌హార శైలి భ‌రించ‌లేకే ఎర్ర‌బెల్లి వంటి సీనియ‌ర్లు టీడీపీని వీడార‌ని మోత్కుప‌ల్లి ఆరోపించారు. అంతేకాదు..ఓటుకు నోటు కేసుపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సంచ‌ల‌నాత్మ‌క ఓటుకు నోటు కేసు బాధ్యుడు రేవంత్ రెడ్డే అని మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు. మ‌రో నేత అర‌వింద్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీ వ‌ల్లే రేవంత్ ఈ స్థాయికి వ‌చ్చార‌ని, ఆయ‌న పార్టీని వీడినా టీడీపీకి వ‌చ్చే న‌ష్టం ఏమీలేద‌ని మండిప‌డ్డారు. అటు టిడిపి పొలిట్ బ్యూరో స‌మావేశానికి హాజ‌ర‌య్యేముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత‌లు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్,

డి.కె. అరుణ‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని వార్త‌లొచ్చాయి. రేవంత్ కాంగ్రెస్ లో చేర‌డాన్ని ఆ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నందున‌, స‌ర్దిచెప్పేందుకే ఆయ‌న వారితో భేటీ అయ్యార‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క‌థ‌నాలు వ‌చ్చిన కాసేప‌టికే..రేవంత్ కాంగ్రెస్ లో చేరితే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని డీ.కె. అరుణ ప్ర‌క‌టించ‌డంతో ఈ ఊహాగానాల‌కు మ‌రింత బ‌ల‌మొచ్చింది. ఓ ప‌క్క కాంగ్రెస్ నేత‌ల‌తో ర‌హ‌స్యంగా భేటీ అయి, మ‌రో ప‌క్క టీడీపీ పొలిటో బ్యూరో స‌మావేశానికి హాజ‌ర‌వ‌డంలో రేవంత్ రెడ్డి ఉద్దేశ‌మేంటో చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత తేల‌నుంది.