అమెరికా, ఉత్త‌ర‌కొరియా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌

Tensions in US and North Korea Border
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్న‌ట్టే క‌నిపిస్తున్నాయి. యుద్ద విమానాలు గాల్లోకి లేచాయి. ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని ప్ర‌పంచానికి సంకేతాలు ఇస్తున్నాయి. అవును ఉత్త‌ర‌కొరియా, అమెరికా స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ప‌రిస్థితి గురించే మ‌నం మాట్లాడుకునేది. కొన్నిరోజులుగా రెండు దేశాల మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక‌త్త ప‌రిస్థితులు ఐక్య‌రాజ్య‌స‌మితిలో ట్రంప్ ప్ర‌సంగం త‌ర్వాత పూర్తిగా దిగ‌జారాయి. ఉత్త‌ర‌కొరియాను స‌ర్వ‌నాశ‌నం చేస్తామ‌ని ట్రంప్ హెచ్చ‌రించ‌డంతో మాట‌ల యుద్ధం మొద‌ల‌యింది. ట్రంప్ ను ఉత్త‌రకొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ మానసిక రోగిగా అభివర్ణిస్తే…కిమ్ ను ట్రంప్ పిచ్చోడ‌ని విమ‌ర్శించాడు.
ఉత్త‌ర‌కొరియా విదేశాంగ మంత్రి ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను, కుక్క అరుపులతో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో ట్రంప్ ఇంత‌క‌ముందెన్న‌డూ లేని ప‌రిణామాలు  ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని కిమ్ ను హెచ్చ‌రించారు. ట్రంప్  ఈ వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే అమెరికా ఉత్త‌ర‌కొరియా స‌రిహ‌ద్దుల్లో యుద్ధ విమానాలు మోహ‌రించింది. అమెరికాకు చెందిన బాంబ‌ర్ విమానాలు ఉత్త‌ర‌కొరియా స‌రిహ‌ద్దుల‌కు అతి స‌మీపంలో ప్ర‌యాణించాయి.ఉభ‌య కొరియాల‌కు మ‌ధ్య ఉన్న సైనిక ర‌హిత ప్రాంతంలో అమెరికా బాంబ‌ర్ గా అనుమానిస్తున్న విమానం ప్ర‌యాణించింది. 21వ శ‌తాబ్దంలో ఓ అమెరికా విమానం ఈ ప్రాంతంలో ప్ర‌యాణించ‌డం ఇదే తొలిసారి.  ఎటువంటి  శ‌త్రువునైనా ఓడించేందుకు అమెరికా సిద్దంగా ఉంద‌ని ప్ర‌త్య‌ర్థుల‌కు అర్ధమ‌య్యేట‌ట్టు చెప్పేందుకే  ఈ చ‌ర్య‌కు దిగామ‌ని పెంట‌గాన్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఉత్త‌ర‌కొరియా విదేశాంగ మంత్రి రి యంగ్ ప్ర‌సంగానికి కొద్ది స‌మ‌యం ముందు అమెరికా విమానాలు స‌రిహ‌ద్దుల్లో ఎగిరాయి. ఈ ఘ‌ట‌న‌పై ఉత్త‌రకొరియా తీవ్రంగా స్పందించింది.
ట్రంప్ ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు అని ఉత్త‌ర‌కొరియా విదేశాంగ‌మంత్రి రియంగ్ హోస్ ఐరాస‌లో వ్యాఖ్యానించారు. ట్రంప్ స‌రిదిద్దుకోలేని త‌ప్పు చేస్తున్నార‌ని, ఉత్త‌ర‌కొరియా క్షిప‌ణ‌లు అమెరికా ప్ర‌ధాన భూభాగాన్ని తాకుతాయ‌ని హెచ్చ‌రించారు. విదేశాంగ‌మంత్రి హెచ్చ‌రిక‌ల‌పై ట్రంప్ ట్విట్ట‌ర్ లో స్పందించారు. రి, కిమ్ లు ఇలాగే ప్ర‌గ‌ల్భాలు ప‌లికితే ఎక్కువ సేపు ఈ చుట్టుప‌క్క‌ల ఉండ‌రు అని హెచ్చ‌రించారు. ఓ ప‌క్క ఈ మాట‌ల యుద్ధం సాగుతుండ‌గానే..ఉత్త‌ర‌కొరియాలోని అణ్వాయుధ ప‌రీక్షా కేంద్ర‌మైన ప్యుంగేరీ స‌మీపంలో 3.2 తీవ్ర‌త‌తో భూమి కంపించింది. దీంతో ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. దీనిపై ప్ర‌పంచ దేశాలు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తంచేస్తున్నాయి. ఉత్త‌ర‌కొరియా అణు ప‌రీక్ష జ‌రిపిఉంటుంద‌ని చైనా చెబుతుండ‌గా…ఆ వాద‌న‌ను ద‌క్షిణ కొరియా కొట్టిపారేసింది. అవి సాధార‌ణ‌ప్ర‌కంప‌న‌లే అయి ఉంటాయని అభిప్రాయ‌ప‌డింది.