మాల్యా తో అప్పు కట్టిస్తేనే ఆమె రైలు టికెట్ కొంటుంది.

Premlata Bhansali Traveller Refused To pay Fine

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అమాయక జనం ఎలాగైనా ఏమార్చవచ్చని రాజకీయ నాయకులకి ఓ నమ్మకం. మరీ ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఏమి చెప్పినా నమ్మేస్తారని వారి అభిప్రాయం. అయితే ఇకపై అలాంటి హామీలు ఇచ్చే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించుకోవాలేమో. ముంబై లో టికెట్ కొనకుండా రైలు ఎక్కిన ఓ మహిళ ఫైన్ కట్టకుండా చేస్తున్న వాదన వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నేతలకి దిమ్మ తిరిగిపోతుంది. ఇంతకీ ఆమె చేసిన పని, చేసిన వాదన ఏంటో చూద్దామా ?

ప్రేమలత భన్సాలీ ముంబై బులేశ్వర్ ప్రాంతంలో వుంటారు. 44 ఏళ్ల ఈ మహిళ ముంబై సబ్ అర్బన్ రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ చెకింగ్ అధికారికి దొరికిపోయారు. టికెట్ కొనకుండా రైలు ఎక్కినందుకు 260 రూపాయలు ఫైన్ కట్టాలని ఆ అధికారి కోరాడు. అందుకు నిరాకరించిన ప్రేమలత ముందు లండన్ నుంచి మాల్యా ని రప్పించి ఆయన తీసుకున్న అప్పు వడ్డీతో సహా బ్యాంకులకు తిరిగి చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు. మాల్యా ని అరెస్ట్ చేసి ఫైన్ కట్టిస్తే తానూ ఫైన్ కడతాను తప్ప ముందుగా జరిమానా ఇచ్చేది లేదని ఆమె వాదించారు. జైలుకి వెళ్ళడానికి కూడా ఆమె సిద్ధం అని చెప్పారు. ఇలా ఒకటిరెండు కాదు మొత్తం 12 గంటల పాటు ఆమె వాదించారు. ఇక ఆమెతో లాభం లేదని ప్రేమలత భర్త రమేష్ భన్సాలీ ని పిలిపించారు. ఆయన కూడా భార్య కి నేను నచ్చజెప్పలేనని చేతులు ఎత్తేసారు. దీంతో మరో గత్యంతరం లేక ప్రేమలతని మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఆమె ఇదే వాదన వినిపించి జైలుకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు.

ప్రేమలత చేసిన పని సిల్లీ గా అనిపించవచ్చు. ఆమె చేసింది తప్పే కావొచ్చు. కానీ ప్రభుత్వాలు, పాలకులు సామాన్యులు, ధనవంతుల మధ్య చూపుతున్న బేధాన్ని మాత్రం ఎత్తి చూపగలిగారు. ఎంత పెద్ద తప్పు చేసినా డబ్బు, పరపతి ఉంటే తప్పించుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అదే సామాన్యుడైతే ప్రతి ఒక్కరికి భయపడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకిలా అని కాస్త మొరటుగానే ప్రశ్నించిన ప్రేమలత మారుతున్న సామాన్యుడి స్వరానికి ప్రతీక అనుకోవచ్చేమో. ఈ చైతన్యం సామాన్యుడిలో వచ్చిన రోజు పాలకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకుంటారు… నడుచుకోవాల్సి వస్తుంది.