అర్ధ‌రాత్రి మ‌హిళ‌లు భేషుగ్గా తిర‌గ‌వ‌చ్చు.

Women Can Travel Midnights

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Women Can Travel Midnights

 

అర్ధ‌రాత్రి మ‌హిళ‌లు ఒంట‌రిగా తిరిగిన‌ప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ట్టు అన్నారు  జాతిపిత మ‌హాత్మా గాంధీజీ. అర్ధ‌రాత్రి సంగ‌తి ప‌క్క‌న బెడితే ప‌ట్ట‌ప‌గ‌లే  న‌డిరోడ్డు మీద మ‌హిళ‌లు ఒంట‌రిగా తిర‌గాలంటేనే భ‌య‌పడాల్సిన ప‌రిస్థితి దేశంలో నెల‌కొంది. అయితే కేంద్ర‌పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రం ప‌రిస్థితి ఇందుకు భిన్నం. అక్క‌డ అర్ధ‌రాత్రి కూడా మ‌హిళ‌లు సుర‌క్షితంగా తిరిగే అవ‌కాశ‌ముంది. ఈ మాట చెప్పింది ఎవ‌రో సాధార‌ణ మ‌హిళ కాదు. సాక్షాత్తూ ఆ ప్రాంత లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ. 

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కు స‌మ‌స్యేముంటుంది?  భారీ బందోబ‌స్తు ఉంటుంది కాబ‌ట్టి ఏ టైంలోన‌యినా బ‌య‌ట తిర‌గొచ్చు…ఆమె భ‌ద్ర‌తకు ఢోకా ఏమీ ఉండ‌దు క‌నుక ఎలాంటి భ‌యాందోళ‌న‌లు లేకుండా  మ‌హిళ‌లు అర్ధ‌రాత్రి కూడా స్వేచ్ఛ‌గా తిర‌గొచ్చు అని చెప్తున్నారు… అనుకుంటున్నారా..? అదేమీ కాదు. ఆమె సాదార‌ణ మ‌హిళ‌ల‌కే పుదుచ్చేరిలో రాత్రి వేళ‌ల్లో భ‌ద్ర‌త ఉంద‌ని భ‌రోసా ఇస్తున్నారు.  అధికారులు ఎవ‌రో తెచ్చిన నివేదిక‌లు చూసి ఆమె ఈ వ్యాఖ్య‌లు చేయ‌టం లేదు. భ‌ద్ర‌త‌ను స్వ‌యంగా ప‌రిశీలించిన త‌రువాతే పుదుచ్చేరిలో రాత్రివేళ మ‌హిళ‌లు ఉండ‌టం సుర‌క్షిత‌మే అని స‌ర్టిఫికెట్ ఇచ్చారు.

ఇలా చెప్పేముందు ఆమె ద్విచ‌క్ర‌వాహ‌నంపై అర్ధ‌రాత్రి పుదుచ్చేరి ప్ర‌ధాన ర‌హ‌దారులతో పాటు ప‌లు వీధుల్లో సుమారు గంట‌పాటు తిరిగి మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌ను స‌మీక్షించారు. ఆ స‌మ‌యంలో ఆమె వెంట భ‌ద్ర‌తా సిబ్బంది ఎవ‌రూ లేరు. త‌న కార్యాల‌య మ‌హిళా ఉద్యోగి ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెనుక కూర్చుని కిర‌ణ్ బేడీ పాండిచ్చేరి ర‌హ‌దారుల‌ను చుట్టివ‌చ్చారు. ఎవ‌రూ త‌న‌ను గుర్తుప‌ట్ట‌కుండా మొహానికి చున్నీ క‌ప్పుకున్నారు. ప్ర‌యాణంలోఅక్క‌డ‌క్కాడా వెహిక‌ల్ ఆపి దారిలో క‌నిపించినవారితో ముచ్చ‌టించి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. కిర‌ణ్ బేడీ చేసిన ఈ సాహ‌సాన్ని ఎవ‌రో వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కిర‌ణ్ బేడీ ధైర్యాన్ని , మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం ఆమె చేస్తున్న కృషిని  నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. దీనిపై కిర‌ణ్ బేడీ ట్విట్ట‌ర్ లో స్పందించారు. పుదుచ్చేరిలో రాత్రి వేళ బ‌య‌ట ఉండ‌టం క్షేమ‌క‌ర‌మే అని మ‌హిళ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు అయిన‌ప్ప‌టికీ పోలీసులు గ‌స్తీ పెంచాల‌ని సూచించారు.