ఏపీ ప్రభుత్వం సిఫార్సు…బీజేపీ మాస్టర్ ప్లాన్ !

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార వర్గాల్లో మార్పులు అనూహ్యంగా చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన అధికారిగా ఆర్పీ సిసోడియాను ఉన్న పళంగా బదిలీ చేసిన కేంద్రం ఆయన స్థానంలో కొత్తగా గోపాలకృష్ణ ద్వివేదీ అనే అధికారిని నియమించారు. కొద్ది రోజులుగా ఏపీ ఎన్నికల అధికారి సిసోడియాపై వైసీపీ నేతలు అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవతకవకలంటూ పలుమార్లు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చారు. అదే తరహా ఆరోపణలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆధారాలతో సహా కోర్టులో పిటిషన్లు వేసింది. అయినా అక్కడి ఎన్నికల అధికారిని మార్చే ఆలోచన కూడా చేయని కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీ ఎన్నికల అధికారిని మాత్రం ఉన్న పళంగా కేంద్రం ఎన్నికల ప్రకటనకు రాక ముందే మార్చేసింది. సిసోడియా స్థానంలో నియమితులైన గోపాలకృష్ణ ద్వివేదీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారినే. ఏపీ ప్రభుత్వ సిఫార్సు మేరకే ఆయన నియామకం జరిపామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఆయన చాలా కాలంగా కేంద్ర సర్వీస్లులో ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖలో పని చేస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత గరువు జకిర్ నాయక్ అలియాస్ జకీర్ అబ్దుల్ కరీం నాయక్ సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ విదేశాల నుంచి నిధులు రావడానికి అవసరమైన కొన్ని అనుమతులు అక్రమంగా ఇచ్చారనే ఆరోపణలపై.. ఆయనను గతంలో సస్పెండ్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తి వేశారు. కానీ ఆ వ్యవహారం కేంద్రం హోంమంత్రి గుప్పిట్లోనే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ద్వివేదీ ఏపీ ఎన్నికల అధికారిగా బీజేపీ నుంచి వచ్చే ఆదేశాలను పాటించాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ గెలుపు కాదని టీడీపీ ఓటమే లక్ష్యంగా బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే గోపాలకృష్ణ ద్వివేదీ నియామకం జరగిందన్న అనుమానాలు టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేయడం ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది.