తహసీల్దార్‌ని సజీవదహనం చేసిన నిందితుడి మృతి

తహసీల్దార్‌ని సజీవదహనం చేసిన నిందితుడి మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన నిందితుడు తీవ్రంగా కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్‌ మృతి చెందాడు. విజయారెడ్డిని సజీవ దహనం చేసిన రైతు సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపగ ఈ రోజు చనిపోయాడు.

పోలీసులు సురేష్ స్టేట్‌మెంట్ రెండు రోజుల క్రితమే  రికార్డ్ చేశారు. భూమికి సంబంధించి పట్టా కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా కోర్టు కేసులు ఉన్నాయని విజయా రెడ్డి చెప్పారు. ఎంత వేడుకున్నా పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారని మరోసారి బతిమిలాడగా ఎమ్మార్వో స్పందించక పోవడంతో పెట్రోలు తనపై పోసుకొని తర్వాత విజయా రెడ్డిపై పోశాను అని చెప్పాడు. తాను నిప్పు అంటించుకుని ఆమెకి కూడా అంటించి, చనిపోవాలని ఇలా చేశానని చెప్పాడు.

పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు చనిపోయాడని వైద్యులు తెలిపారు. 4వ తేదీన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని సురేష్‌ పెట్రోల్‌పోసి తగలబెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.