మహేష్‌ ఫ్యామిలీ నుండి మరొకరు

Super Star Krishna Grandson Jayakrishna Entry in Tollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో వారసులకు కొదువ లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం వారసులు ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుండి మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఆ ఫ్యామిలీ నుండి మహేష్‌బాబు, సుధీర్‌బాబు, మంజుల ఉన్న విషయం తెల్సిందే. తాజాగా రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. హీరోగా పలు చిత్రాలు చేసిన రమేష్‌బాబు సక్సెస్‌ కాలేక పోయాడు. ఆ తర్వాత నిర్మాతగా మరియు స్టూడియో అధినేతగా కొనసాగుతూ వచ్చాడు. తాజాగా ఆయన కొడుకును హీరోగా పరిచయం చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

కృష్ణ పోలికలు పుణికి పుచ్చుకున్న జయకృష్ణ గత కొంత కాలంగా నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అన్ని రకాల పాత్రలు చేసేందుకు జయకృష్ణ సన్నద్దం అవుతున్నాడు. ఈయనకు కుటుంబ సభ్యులు అంతా కూడా వెన్నుదన్నుగా నిలువబోతున్నారు. ప్రస్తుతం వైజాగ్‌ సత్యానంద్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో నటనలో ప్రావిణ్యం సంపాదిస్తున్న జయకృష్ణ ఈ సంవత్సరంలోనే తన మొదటి సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరంలో సినిమాను ప్రారంభించి వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ఒక ప్రముఖ నిర్మాత జయకృష్ణను వెండి తెరకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం ఆ నిర్మాత కథలు సిద్దం చేయిస్తున్నాడని, కృష్ణ ఫ్యామిలీకి కథ నచ్చితే సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్‌బాబు ఆశీస్సులతో జయకృష్ణ ఖచ్చితంగా సక్సెస్‌ అవుతాడనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.