Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం శిక్షలు ఖరారు చేసింది. కీలక నిందితుడు గ్యాంగ్ స్టర్ అబూ సలేంకు జీవిత ఖైదు, రూ2లక్షల జరిమానా విదించింది. అబూసలేంతో పాటు రెండో విడత విచారణలో భాగంగా…గత జూన్ లో దోషులుగా నిర్ధారించిన తాహిర్ మర్చంట్, ఫిరోజ్ కు ఉరిశిక్ష విధించింది. కరీముల్లాఖాన్ కు యావజ్జీవం, రెండులక్షల జరిమానా విధించింది. మరో దోషి రియాజ్ సిద్దిఖీకి 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మరో దోషి ముస్తఫా దోసా జూన్ లో గుండెపోటుతో మరణించాడు. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాననిందితుడు అయిన అబూసలేంకు ఉరిశిక్ష పడుతుందని అంతా భావించారు. అయితే నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా పోర్చుగల్ నుంచి అబూసలేంను తీసుకురావటంతో ఆ దేశానికి హామీ ఇచ్చినట్టుగా ఉరిశిక్ష వేయలేదు. అత్యంత తీవ్రమైన నేరం చేసినప్పటికీ…గరిష్ట శిక్ష వేయలేకపోతున్నామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 1993 మార్చి 12న జరిగిన ముంబై పేలుళ్ల కేసుపై రెండు విడతలుగా విచారణ జరిగింది.
రెండు గంటల వ్యవధిలో 12 చోట్ల బాంబు దాడులు జకగడంతో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 713 మంది తీవ్రంగా గాయపడ్డారు..కేసు విచారణ చేపట్టిన సీబీఐ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, మహ్మద్ దోసా, ముస్తఫా దోసా కుట్ర పన్ని దాడికి పాల్పడినట్టు తేల్చింది. బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్టు సీబీఐ విచారణలో తేలింది. ముంబైలోని ప్రత్యేక టాడా కోర్టులో 1993 నుంచి సాగిన విచారణ 2007లో ముగిసింది. పేలుళ్లకు సంబంధించి 100 మందిని దోషులుగా తేల్చింది. వారిలో ఒకరైన యాకూబ్ మెమన్ కు 2013లో సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో ఈ ఉరిశిక్షను అమలు చేసింది. అయితే విచారణ ముగిసే సమయంలో ముంబై పేలుళ్లతో సంబంధముందంటూ అబూ సలేం సహా ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో వీరిని ప్రధాన విచారణ నుంచి వేరు చేసి రెండో విడత విచారణ జరిపింది టాడా కోర్టు. వారిలో ఒకరైన అబ్దూల్ ఖయ్యూమ్ ను ఆధారాల్లేవంటూ నిర్దోషిగా ప్రకటించిన కోర్టు మిగిలిన ఆరుగురిని దోషులుగా నిర్దారించింది. దోషుల్లో ఒకరైనా ముస్తఫా దోసా గుండెపోటుతో మృతిచెందటంతో మిగిలిన ఐదుగురికి శిక్షలు ఖరారు చేసింది. ముంబై పేలుళ్ల తరువాత ప్రధాన నిందితులు దేశం విడిచి పారిపోయారు. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ పారిపోయి అప్పటినుంచి ఆ దేశంలోనే తలదాచుకుంటున్నాడు. అబూసలేం మౌనికా బేడీతో కలిసి పోర్చుగల్ పారిపోయాడు. మాదక ద్రవ్యాల కేసులో పోర్చుగల్ పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు భారత్ కు అప్పగించారు. పోర్చుగల్ లో ఎంత తీవ్రమైన నేరానికైనా ఉరిశిక్ష విధించరు. అబూసలేంను అప్పగించేటప్పుడు పోర్చుగల్ భారత్ కు ఉరిశిక్ష వేయకూడదని షరతు విధించింది. దీంతో అబూ సలేం ఉరినుంచి తప్పించుకోగలిగాడు. మరోవైపు తీర్పుపై బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.
మరిన్ని వార్తలు: