ఆంధ్రప్రదేశ్‌ వణుకు

ఆంధ్రప్రదేశ్‌ వణుకు

వరుస విపత్తులతో ఆంధ్రప్రదేశ్‌ వణుకుతోంది. తుపానులు, వరదలు, కరువు తరచూ ప్రజలకు కడగండ్లు మిగుల్చుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు పదిసార్లు వరదలు ముంచెత్తి రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఆరుసార్లు తుపానులు విరుచుకుపడ్డాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు ఏటా మూడు, నాలుగుసార్లు పలకరించి నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుత వరదలు బీభత్సం సృష్టించాయి. 2015 నవంబర్‌లోనూ ఇప్పటి మాదిరిగానే చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయ్యాయి.

నవంబర్‌ 9 నుంచి 23 వరకు నెల్లూరు జిల్లా బలయపల్లెలో 100.5 సెంటీమీటర్లు, వైఎస్సార్‌ జిల్లా కోడూరులో 99.9, చిత్తూరు జిల్లా ఏర్పేడులో 87.5 సెంటీమీటర్ల వర్షం పడడంతో వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో 81 మంది మృత్యువాతపడ్డారు. 2014లో వచ్చిన హుద్‌హుద్‌ తుపాను ఉత్తరాంధ్రలో పెను బీభత్సం సృష్టించింది. 2014 నుంచి 2018 వరకు వరుస కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2018లో భారీ వర్షాలు, రెండు తుపాన్లు, ఖరీఫ్‌–రబీ సీజన్లలో కరువు విరుచుకుపడ్డాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు.

దేశంలో ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఎక్కువగా ఉన్న మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉందని కౌన్సిల్‌ ఆఫ్‌ ఎనర్జీ అధ్యయనం తేల్చింది. వరదలు, తుపానుల తీవ్రత ఏపీలో ఎక్కువని, విపత్తుల తీవ్రత అసాధారణంగా ఉన్న దేశంలోని ఐదు జిల్లాల్లో విజయనగరం ఒకటని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాలు తరచూ విపత్తుల బారిన పడుతున్నాయని పేర్కొంది. 2005 నుంచి దేశంలో విపత్తుల తీవ్రత 200 శాతం పెరిగిందని, వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌తోపాటు ఆ జిల్లాల్లోని భౌగోళిక పరిస్థితుల్లో మార్పులే దీనికి కారణమని వివరించింది.

రాష్ట్రానికి అనేక శతాబ్దాల నుంచి తుపానుల ముప్పు వుంది. కానీ.. కొన్నేళ్లుగా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ దీనికి కారణం. దీనివల్ల తుపానుల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. మరోవైపు వర్షం కురిసే రోజులు తగ్గిపోతున్నాయి. 30 రోజులు కురవాల్సిన వర్షాలు పది రోజుల్లోనే కురుస్తున్నాయి. దీనివల్ల వరదలు వస్తున్నాయి. ఎక్కువ రోజులు వర్షం పడకపోవడం (డ్రై స్పెల్స్‌) వల్ల కరువు వస్తోంది. రాష్ట్రంలో గత పదేళ్లుగా వర్షం కురిసే రోజులు తగ్గి డ్రై స్పెల్స్‌ పెరిగాయి. అందుకే కరువు వస్తోంది. వేడి గాలుల తీవ్రత పెరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం.