సినిమా కోసం 14 కిలోల బరువు తగ్గిన బన్నీ

సినిమా కోసం 14 కిలోల బరువు తగ్గిన బన్నీ

టాలీవుడ్లో పాత్రలకు తగ్గట్లు అవతారం మార్చుకుని.. సినిమాకో లుక్‌తో కనిపించడానికి తపించే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. గత కొన్నేళ్లలో బన్నీ నుంచి వచ్చిన సినిమాల్ని గమనిస్తే సినిమాకో రకంగా కనిపించాడు. రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య.. సినిమాల్లో అతడి లుక్‌ను గుర్తు చేసుకుంటే ఆ విషయం బోధపడుతుంది. ఇప్పుడు ‘సామజ వరగమన’ కోసం కూడా లుక్ మార్చాడు బన్నీ. ఇందుకోసం అతను బరువు తగ్గాడు. హేర్ స్టైల్ మార్చాడు. మునుపటి కన్నా చార్మ్‌తో కనిపిస్తున్న బన్నీ అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఈ లుక్ కోసం బన్నీ బాగానే కష్టపడ్డాడట. కీటో డైట్‌ను అనుసరించాడట. సినిమా మొదలు కావడానికి కొన్ని నెలల ముందు ఈ డైట్ పాటించి 14 కిలోల దాకా బరువు తగ్గాడట బన్నీ.

ఈ డైట్‌లో భాగంగా నాలుగు నెలల పాటు బన్నీ  కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్డే తీసుకోలేదట. డైట్ విషయంలో ట్రైనర్ సాయంతో కచ్చితమైన ప్రణాళిక వేసుకుని దాన్ని అనుసరిస్తూ క్రమ పద్ధతిలో బరువు తగ్గాడట బన్నీ. ‘నా పేరు సూర్య’ సమయానికి ఫిట్‌గానే ఉన్న బన్నీ.. ఆ సినిమా డిజాస్టర్ అయ్యాక ఏ సినిమా ఖరారు చేయకుండా దాదాపు పది నెలలు గడిపేశాడు. ఈ సమయంలో బన్నీ బరువు బాగా పెరిగిపోయాడట. త్రివిక్రమ్ సినిమా ఖరారయ్యాక లుక్ గురించి డిస్కస్ చేసుకుని బరువు తగ్గాలని డిసైడయ్యాడట. ఇలాంటి విషయాల్లో అస్సలు రాజీ పడని బన్నీ.. పట్టుదలతో నాలుగు నెలల్లో బరువు తగ్గి అనుకున్న లుక్‌లోకి మారాడు. ఈ సినిమాలో అతడి హేర్ స్టైల్ సైతం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.