అత్త ముక్కు కొరికిన అల్లుడు.. చెవిని కత్తిరించిన తండ్రి !

Aunt's nose-bitten by son-in-law ...Father who cut off the ear!

అడిగినంత కట్నం ఇవ్వలేదనే కారణంతో ఓ అల్లుడు అత్త ముక్కు కొరికేసిన ఘటన సంచలనంగా మారింది. అంతే కాకుండా అతడి తండ్రి కూడా వియ్యంకురాలిపై దాడి చేసి చెవి కోసేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జరిగింది.

స్థానికంగా వ్యాపారం చేసే మహ్మద్ అష్ఫక్ అనే యువకుడికి చాంద్‌బీ తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 10లక్షల కట్నం ఇచ్చేందుకు చాంద్ బీ తండ్రి రెహమాన్ ఒప్పుకున్నాడు. అన్నమాట ప్రకారమే ఆ మొత్తాన్ని చెల్లించాడు.

అయితే అష్ఫక్ దంపతులకు ఓ పాప పుట్టిన తరువాత నుంచీ మరో 5 లక్షల కట్నం తేవాలంటూ అష్ఫక్ భార్యను వేధించసాగాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య ఆదివారం కూడా వాగ్వివాదం చోటుచేసుకుంది.

దీంతో రెచ్చిపోయిన అష్ఫక్ భార్యపై చేయిచేసుకున్నాడు. చాంద్ బీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో వారు వెంటనే అల్లుడి ఇంటికి వచ్చారు. అష్ఫక్‌కూ, అతడి తల్లితండ్రులకూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఇరు కుంటుంబాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో విచక్షణ కోల్పోయిన అష్ఫక్, అతడి తండ్రీ చాంద్ బీ తల్లిపై దాడిచేశారు. ఆష్ఫక్ ఆమె ముక్కును కొరికేయగా, అతడి తండ్రి వియ్యంకురాలి చెవిని కత్తితో కోసేశాడు.

రక్తం ఏరులై పారడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో కంగారు పడిన నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.