పవన్ తో కలిసి పోరాటం చేసేందుకు సిద్దంగా లేని బీజేపీ

పవన్ తో కలిసి పోరాటం చేసేందుకు సిద్దంగా లేని బీజేపీ

పవన్ తో వేదిక పంచుకోమన్న బీజేపీ ఇసుక కొరత పైన అన్ని పార్టీలను కలిపి ప్రభుత్వం పోరాటం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు ఫోన్ చేసి మద్దతు కోరారు. తొలుత సూత్రప్రాయంగా కన్నా అంగీకరించారు. అయితే, సాయంత్రానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తమ పార్టీ ఇసుక అంశంలో తొలి నుండి పోరాటం చేస్తోందని తాము పవన్ తో కలిసి వేదిక పంచుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ సైతం తమ వైఖరిని ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు. ఇసుక సత్యాగ్రహం లక్షలాదిమంది కార్మికులను రోడ్డుపాలు చేసిన ఇసుక సమస్యపై బీజేపీ మొదటినుండి రాజీలేని పోరాటంచేస్తూ గవర్నర్,సీఎం దృష్టికి తెచ్చి భిక్షాటనతో ప్రజాపక్షాన నిలిచాం నవంబర్ 4న బీజేపీ ఆధ్వర్యంలో “ఇసుక సత్యాగ్రహం” చేపడుతున్నాం.

ఇసుక సమస్య పై పోరాడే ఎవరికైనా బీజేపీ సంఘీభావం తెలుపుతుంది..అంటూ ట్వీట్ లో స్పస్టం చేసారు. దీని ద్వారా పవన్ తో కలిసి పోరాటం చేసేందుకు బీజేపీ సిద్దంగా లేదని తేల్చి చెప్పారు. దీంతో, వామపక్ష పార్టీలు.. లోక్ సత్తా మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీలో తర్జన భర్జన ఇక, బీజేపీ తాము పవన్ తో కలిసి వేదిక పంచుకోమని స్పష్టం చేయటంతో టీడీపీలోనూ చర్చ మొదలైంది. పవన్ ఆహ్వానం మేరకు కలిసి పోరాటం చేయటం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందని..అదే సమయంలో రాజకీయంగానూ భవిష్యత్ లో పరిస్థితులను అనుకూలంగా మలచుకోవటానికి మార్గం ఏర్పడుతుందని తొలుత టీడీపీ భావించింది. అయితే, బీజేపీ ఇప్పుడు ససేమిరా అనటంతో..తాము ఇప్పటికే పవన్ తో మైత్రి కొనసాగిస్తున్నామనే భావన వైసీపీ బలంగా ప్రజల్లో కల్పించిందని..అదే అభిప్రాయం పార్టీ కేడర్ లోనూ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

జనసేనతో దూరంగా ఉంటేనే ఇటువంటి పరిస్థితుల్లో జనసేనతో దూరంగా ఉంటేనే పార్టీ కేడర్ లో నమ్మకం ఏర్పడుతుందని వారు సూచిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో గత ఎన్నికల్లో పవన్..బీజేపీతో దూరంగా ఉండటం కారణంగానే నష్టపోయామని..ఇప్పుడు పవన్ స్వయంగా ఆహ్వానించటంతో మద్దతు ఇస్తేనే బాగుంటుందని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, టీడీపీ ఇప్పటికే ఇసుక సమస్య పైన పోరాటం చేస్తుండటంతో ఏ నిర్ణయం తీసుకున్నా నష్టం ఉండదని పార్టీ నేతల వాదన. దీని పైన తుది నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకోవాల్సి ఉంది.

పవన్ పిలుపునిచ్చిన ర్యాలీకి ఇక, ఇప్పటికే ఇసుక సమస్యను తాము పరిష్కరిస్తామని చెబుతున్నా..టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఇప్పుడు పవన్ పిలుపునిచ్చిన ర్యాలీకి మద్దతిస్తుందా లేదా అనే నిర్ణయం కోసం వేచి చూసే ధోరణితో ఉంది. టీడీపీ నిర్ణయానికి అనుగుణంగా వైసీపీ అటు పవన్ ను ..ఇటు టీడీపీని లక్ష్యంగా చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.