వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు

వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు

వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, ప్రపంచ దేశాలు తక్షణమే మేలుకొని, దిద్దుబాటు చర్యలు ప్రారంభించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హెచ్చరించారు. స్కాట్లాండ్‌లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్‌ ఈవెంట్‌ క్యాంపస్‌లో ఆయన సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించారు.

బ్రిటన్‌ ఆతిథ్యం ఇస్తున్న కాప్‌–26 నవంబర్‌ 12 దాకా కొనసాగనుంది. సోమవారం భారత ప్రధాని మోదీ సహా దాదాపు 120 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రపంచం అంతం కాకుండా పోరాడే జేమ్స్‌బాండ్‌ ఆగమనం లాంటిదేనని బోరిస్‌ జాన్సన్‌ అభివర్ణించారు. అర్ధరాత్రి కావడానికి మరొక్క నిమిషం మాత్రమే ఉందని, మనం ఇప్పుడే ముందడుగు వేయాలని ఉద్బోధించారు.

2015లో పారిస్‌లో జరిగిన కాప్‌ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు కర్బన ఉద్గారాలకు కత్తెర వేసే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి గ్లాస్గోలో కాప్‌–26 నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను జాన్సన్‌ గుర్తుచేశారు. పాలకులు ఇస్తున్న హామీలన్నీ నీటి మూటలవుతున్నాయని థన్‌బర్గ్‌ ఆరోపించారని అన్నారు. మాట తప్పితే ప్రజలు మనల్ని క్షమించబోరని చెప్పారు.

భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్‌ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్‌కు ‘ఇండియా గ్రీన్‌ గ్యారంటీ’ ఇస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. క్లీన్‌ ఎనర్జీ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్‌ ప్రాజెక్టులకు ప్రైవేట్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ నుంచి 210 మిలియన్‌ పౌండ్ల రుణ సాయం అందిస్తామని యూకే ప్రకటించింది.

గ్లోబల్‌ వార్మింగ్‌ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్‌ పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడానికి సమయం లేదని, తక్షణమే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఆయన కాప్‌–26లో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను నివారించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో ప్రపంచ దేశాలకు మరింత సాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికాను క్లీన్‌ ఎనర్జీ దేశంగా మారుస్తామంటూ జో బైడెన్‌ ప్రభుత్వ యంత్రాంగం తన ప్రణాళికను విడుదల చేసింది. పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పట్ల జో బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై ఆయన కాప్‌ సదస్సుకు క్షమాపణ చెప్పారు.