తన చుట్టుపక్కల ఉన్న దేశాలకు తన తీరుతో ఉక్కిరిబిక్కిరి చేసే డ్రాగన్ దేశం ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని గడగడలాడుతోంది. తాను మాత్రమే కాకుండా ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే డజనుకు పైగా దేశాల్లోకి కరోనా వైరస్ దూసుకొచ్చేసింది. చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కారణంగా అక్కడి జన జీవనం స్తంభించినపోయినట్లు చెబుతున్నారు.
మరిలాంటి పరిస్థితుల్లో చైనాలోని బడా బడా కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల పరిస్థితేమిటి? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే ఆసక్తికరమైన విషయాలెన్నో బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకూ 140 మందికి పైనే బలి తీసుకొని దాదాపుగా ఆరేడు వేల మందికి కరోనా వైరస్ ప్రబలిన వేళ.. వివిధ కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను భద్రంగా కాపాడుకుంటున్నాయి. ఇందుకోసం వారికి ఎలాంటి వసతినైనా కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగుల భద్రత.. ఆరోగ్యానికి ప్రధమ ప్రాధాన్యతను ఇస్తున్నాయి.
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా యాపిల్.. ఫేస్ బుక్.. టిక్ టాక్.. అలీబాబా కంపెనీలన్ని తమ ఉద్యోగుల్ని ఇంటి దగ్గర నుంచే పని చేయాలని చెప్పేశాయి. ఇంకొన్ని ప్రముఖ కంపెనీలు తమ సంస్థలకు చెందిన షోరూంలను చైనాలో మూసేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఆపరేషన్స్ ను మాత్రం ఇంటి నుంచి చేయిస్తూ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఫేస్ బుక్ చైనాలోని తన ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని చేయాలని చెప్పగా.. దిగ్గజ కంపెనీ ఆలీబాబా కూడా తన ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని కోరుతోంది. పబ్జీ గేమ్ ను క్రియేట్ చేసిన టెనె సెంట్ కంపెనీ అయితే తన ఉద్యోగులకు ఫిబ్రవరి 9 వరకూ సెలవులు ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
యాపిల్ సంస్థ తన స్టోర్ ను చైనాలో మూసి వేయటమే కాదు.. ఉద్యోగుల పని గంటల్ని బాగా తగ్గించింది. ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగుల చైనా టూర్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ అయితే చైనా వెళ్లి వచ్చిన తన ఉద్యోగుల్ని పద్నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉండి.. ఏదైనా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారన్న విషయాన్న చెప్పాలని పేర్కొంది. పలు ఈకామర్స్ సంస్థలతో పాటు.. కొరియా దిగ్గజ సంస్థలు ఎల్జీ.. శాంసంగ్ లు తన ఉద్యోగులకు చైనా టూర్లను బ్యాన్ చేసింది.
ఇక.. హుబే ప్రావిన్స్ లో ప్రయాణించి వచ్చిన వారిని వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుంటేనే ఆఫీసుకు రావాలని చెబుతోంది. ఇక.. ఆన్ లైన్ లో చైనాలో రూంలు బుక్ చేసుకున్న వారికి.. ఆయా సంస్థలు రీఫండ్ ఇచ్చేస్తున్నాయి. దాదాపు మూడు లక్షలకు పైగా హోటళ్లు వారికి అందిన అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేస్తున్నారు. అదే రీతిలో ఫ్లైట్ టికెట్లు.. క్రూజులు ఇలా అన్ని బుకింగ్ సైట్లు వారు చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నాయి. పెద్దగా ప్రచారం జరగటం లేదు కానీ యావత్ చైనా ఇప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. భయం గుప్పిట్లో వణుకుతోంది.