రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు తెలిపిన కేంద్ర బృందం.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను సీఎం జగన్‌కు కేంద్ర బృందం వివరించింది. కేంద్ర బృందం తరఫున కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఎన్ఎండీఏ సలహాదారు కునాల్ సత్యార్థి వివరాలు అందించారు.
ఈ సందర్భంగా కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. 3 రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆ గ్రామాలను కూడా పరిశీలించామని, పశువులు చనిపోవడం, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు.. ల్లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం జగన్ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని, వీరంతా తమకు మంచి సహకారాన్ని అందించారన్నారు.
ఇంకా ఆయనమాట్లాడుతూ.. ‘యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులు ఉన్నారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు. అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి. ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదు. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయి. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి.
కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తీరందాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదు, అది చాలా రోజులు కొనసాగింది. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉంది. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది. కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికందుతున్న సమయంలో నీట పాలైంది.
శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. వాటర్ స్కీములు కూడా దెబ్బతిన్నాయి. అన్నమయ్య నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడింది. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పనిచేశారు. విద్యుత్ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయి. అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం.
సహాయ కార్యక్రమాలకోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు. ఈ డబ్బును బాధితులను వెంటనే ఆదుకునేందుకు వాడుకున్నారు. అలాగే జేసీబీలు పెట్టి.. అవసరమైనచోట యుద్ధ ప్రాతిపదికిన పనులు చేపట్టారు. సహాయక శిబిరాలను తెరిచి ముంపు బాధితులను ఆదుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రశంసనీయం. వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగింది. వీలైనంత మేర ఆదుకోవడానికి మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని సత్యార్థి పేర్కొన్నారు.