ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్నా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్నా

వరి కొనుగోలు అశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గత ఖరీఫ్‌లో 32 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కొన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొనుగోలు పెంచే అంశం పరిశీలనలో ఉందని పేర్కొంది. గత రబీ సీజన్‌లో ఇచ్చిన హామీతో మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

కాగా ఈ అయితే బాయిల్డ్‌ రైస్‌ను కొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాల దృష్టా పంట వైవిధ్యం అవసరమని చెబుతోంది. దేశంలో వరి పంట సాగు ఎక్కువైందని, ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని పేర్కొంది. గత రబీ సీజన్‌లో పండిన పారా బాయిల్డ్ రైస్ 44.7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొంటామని చెప్పినట్లు, అందులో ఇంకా మిగిలి ఉన్న పారా బాయిల్డ్ రైస్ సేకరణ కొనసాగుతోందని పేర్కొంది.

‘ప్రస్తుతం దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు. ఈ తరహా రైస్‌ను వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకమీదట పారా బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాం. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. దేశవ్యాప్తంగా వరి, గోధుమ పంటల దిగుబడి దేశీయ అవసరాలకు మించి జరుగుతోందని తెలిపింది. గోధుమ పండించే చాలా రాష్ట్రాల్లో వరి కూడా సాగు చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం పప్పు దినుసులు, నూనె గింజలకు డిమాండ్ చాలా ఉంది. వాటిని ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ పరిస్థితుల్లోనే పంట మార్పిడి చేసి పప్పు దినుసులు, నూనె గింజల సాగు చేయమని అన్ని రాష్ట్రాలలో రైతులను కోరుతున్నాము.

పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళు పోతే ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి కూడా స్థలం ఉండదు. పంజాబ్ రాష్ట్రంలో వరి పండించినంతగా వినియోగం ఉండదు. అక్కడ 90% సేకరణకు కారణమిదే. తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ప్రజలు వరి వినియోగిస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకిరాని ఇతర వినియోగదారులు కూడా ఉంటారు. ఏ విషయంలోనూ రాష్ట్రాలను కేంద్రం ఒత్తిడి చేయదు. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్చలు జరిపి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది. తదుపరి రబీ సీజన్లో ఎంత కొంటామనేది రాష్ట్రాలో సమావేశం జరిపి, దిగుబడి అంచనాలను చూసి నిర్ణయం తీసుకుంటాం’ అని స్పష్టం చేసింది.