ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయం

ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయం

దేశ రాజధానిలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను‌ నివారించేందుకు కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మాస్కులు ధరించకుంటే 2 వేల రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనాపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి పట్ల ముఖ్యమంత్రితో పాటు ఇతర పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘‘ చాలా మంది మాస్కులు పెట్టుకోవటం లేదు.. అందుకోసమే రూ. 500 నుంచి 2000 రూపాయలకు జరిమానా పెంచాలని నిర్ణయించాం.

కరోనా వల్ల ఈ సారి చట్ పూజ ఇంట్లో నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. చట్ పూజ వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఢిల్లీలో కరోనా వ్యాప్తి నివారణకు ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు పని చేయాలి. ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు ఢిల్లీ వ్యాప్తంగా, మార్కెట్లలో మాస్కులు పంచండి. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాల’’ని కోరారు.