Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే ఏదో జెండా ఎగురవేసి, స్వీట్లు పంచుకునే పిల్లల పండుగ కాదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15న, సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన జనవరి 26న స్వతంత్ర భారతావని కోసం తమ జీవితాలను వెచ్చించిన ఎందరో మహనీయులను తలచుకుంటాం. వారి త్యాగాలను వేనోళ్ల పొగొడుకుంటాం. ఆ అమరవీవరుల ఆశయాల సాధనకు కృషిచేస్తామని ప్రమాణం చేస్తాం. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు రెండు శతాబ్దాల కాలంలో ఎందరో పోరాడారు. బ్రిటిష్ కర్కశ పాలకుల పద ఘట్టనల కింద మరెందరో నలిగిపోయారు. జీవితాన్నంతా దేశానికే వెచ్చించి తర్వాతితరానికి స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి స్ఫూర్తి ప్రదాతల్లో ముందువరుసలో ఉండే నేత షహీద్ భగత్ సింగ్. ఆయన పేరు తలుచుకుంటేనే… ఉడుకు రక్తం ఉప్పొంగుతుంది. అణువణువునా ఉత్తేజం వెల్లివిరుస్తుంది. ఆయన పేరే ఒక నిప్పుకణిక. 23 ఏళ్ల యువకుడిగా దేశం కోసం ఆయన చేసిన అనన్యసామాన్యమైన త్యాగం యువతకు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శమే. మిత్రులారా… ఈ రోజు మీకు నేను చెబుతున్నాను. బానిస భారతదేశంలో నా పెళ్లిగానీ అయినట్టయితే పెళ్లికూతురు ఎవరో తెలుసా..? మృత్యువు. నా శవయాత్ర నా పెళ్లి ఊరేగింపు. ఆ ఊరేగింపులో నా వెంట వచ్చే వాళ్లు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులవుతారు అని చెప్పిన భగత్ సింగ్ అన్నట్టుగానే దేశం కోసం మృత్యువునే పెళ్లాడారు.
1907 సెప్టెంబరు 28న భగత్ సింగ్ జన్మించారు. భగత్ సింగ్ రక్తంలోనే పోరాటం ఉంది. ఆయన కన్నా ముందుగా ఆయన కుటుంబంలోని పలువురు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. భగత్ సింగ్ కు ఊహ తెలిసేనాటికి ఆయన బాబాయ్ కి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవాస కారాగార శిక్ష విధించింది. భగత్ సింగ్ కు ఎంతగానో ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఆయన బాబాయే. బ్రిటిష్ పాలనలో అత్యంత చీకటి అధ్యాయం అయిన జలియన్ వాలాబాగ్ దురాగతం సమయంలో బాలుడయినప్పటికీ భగత్ సింగ్ ను ఆ దారుణం ఎంతగానో బాధించింది. పొలంలో గోధుమ నాట్లు వేస్తున్న తండ్రిని గోధుమలకు బదులు పిస్తోళ్లు నాటవచ్చు కదా… అని ప్రశ్నించి… తన భవిష్యత్ జీవితం ఎలా గడవనుందో సంకేతాలిచ్చారు భగత్ సింగ్. కాలేజీ రోజుల్లోనే రాజకీయాల్లో ప్రవేశించిన భగత్ సింగ్ పెళ్లిచేసుకోమని కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ఇల్లు వీడారు. అక్కడినుంచి దేశమంతా పర్యటిస్తూ ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు.
హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా విసిరారు. హెచ్ ఎస్ ఆర్ ఏ ఎందరో విప్లవకారులను దేశానికి అందించింది. 1928లో జరిగిన సైమన్ కమిషన్ పై తిరుగుబాటు ఘటన భగత్ సింగ్ తో పాటు ఇతర విప్లవకారుల జీవితాలను మార్చివేసింది. సైమన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా హర్తాళ్లు, నిరసనలు జరిగాయి. లాహోర్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించారు. నిరసనకారులపై లాఠీఛార్జ్ జరిగింది. లాలా లజపతి రాయ్ స్థాయిని కూడా పట్టించుకోకుండా సాండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారి ఆయనపై లాఠీతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లాలా లజపతి రాయ్ కొన్ని రోజుల తర్వాత చనిపోయారు. లాల్ మరణంతో దేశం అట్టుడికింది. ముఖ్యంగా విప్లవకారులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. లాల్ మరణానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ వ్యూహం మేరకు భగత్ సింగ్, రాజ్ గురు సాండర్స్ ను తుపాకితో కాల్చిచంపారు. ఈ ఘటనతో దేశం నివ్వెరపోయింది. ఓ వైపు గాంధీ అహింసా రాజకీయాలు వల్లెవేస్తోంటే… దానికి విరుద్దంగా భారతీయులు హింసాయుత చర్యలతో ఓ వ్యక్తి ప్రాణం తీయడం పెను సంచలనం సృష్టించింది.
అయితే దేశంలో మెజారిటీ ప్రజలు ఈ హత్యకు మద్దతు తెలిపారు. విప్లవకారుల చర్యకు నీరాజనాలు పలికారు. గాంధీ అహింసాయుత సిద్దాంతంపైనా, ఆయన రాజకీయ విధానంపైనా నమ్మకం లేని ఎందరో యువకులు హెచ్ ఎస్ ఆర్ ఏ తో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. దేశం మొత్తం విప్లవ భావజాలంతో ఊగిపోయింది. ఈ క్రమంలోనే తమ దుశ్చర్యలను ఖండిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం రెండు బిల్లలు ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. అవి రెండూ భారత్ కు హానికలిగించేవి. అసెంబ్లీ వాటిని తిరస్కరించినప్పటికీ… విశేష అధికారాన్ని ఉపయోగించి బ్రిటిష్ ప్రభుత్వం వాటిని అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఈ రెండు తీర్మానాలను వ్యతిరేకించాలని విప్లవకారులు నిర్ణయించారు. భారతీయల ఆందోళనలు వినపడనట్టు నటిస్తున్న బ్రిటిష్ చెవిటి ప్రభుత్వానికి గట్టిగా వినిపించేలా బాంబు దాడి జరపాలని వ్యూహం రచించారు. అదే సమయంలో స్వచ్ఛందంగా అరెస్ట్ కావడం ద్వారా తమ ఆశయం మరింత మంది ప్రజలకు చేరువచేయాలన్నది విప్లవకారుల లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రాణహాని జరగని రెండు బాంబులు తీసుకుని భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
రెండు బిల్లులపై చర్చ జరుగుతుండగా… భగత్, బటుకేశ్వర్ లు ప్రేక్షకుల్లోనుంచి లేచి నిలబడి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిస్తూ బాంబులు విసిరారు. వెనువెంటనే కొన్ని కరపత్రాలు వెదజల్లారు.. అంతా పొగమయింది. భయంతో అందరూ పారిపోయారు. కొందరు స్పృహతప్పి పడిపోయారు. నిజానికి తప్పించుకోదలచుకుంటే భగత్ సింగ్, బటుకేశ్వర్ లకు అది పెద్ద విషయం కాదు. కానీ వారి లక్ష్యం అదికాదు. పోలీసులు వచ్చిందాకా ఇద్దరూ అక్కడే నిలబడి విప్లవం వర్థిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు విప్లవకారులను అరెస్టు చేసి లాహోర్ సెంట్రల్ జైలుకు తరలించారు. భగత్ సింగ్ జైలు జీవితం కూడా పోరాటాలమయమే. జైల్లో ఖైదీల కనీస హక్కుల కోసం 68రోజుల పాటు ఇతర విప్లవకారులతో కలిసి భగత్ సింగ్ చేసిన నిరాహార దీక్ష స్వతంత్ర భారత చరిత్రలో ప్రత్యేక ఘట్టం. బాంబు దాడి తర్వాత విప్లవకారులపై నిఘా పెరిగింది. భయస్థులు కోవర్టులుగా మారారు. ఒక్కొక్కరుగా విప్లవకారులంతా అరెస్టయ్యారు. బాంబు దాడి సమయంలో భగత్ సింగ్ వెదజల్లిన కరపత్రాల్లో ఉన్న విషయాన్ని, కోర్టు విచారణ సందర్భంగా ఆయన వినిపించిన వాదనను దేశవిదేశాల్లోని పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. విప్లవకారుల సిద్ధాంతాలు దేశప్రజలందరికీ చేరువై ఎందరో మద్దతుదారులుగా మారారు. రెండేళ్లపాటు సాగిన విచారణ అనంతరం భగత్ సింగ్, ఆయన మిత్రులు సుఖ్ దేవ్, రాజ్ గురులకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. మిగిలిన విప్లవకారుల్లో కొందరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరికొందరికి ప్రవాస కారాగార వాసం విధించింది.
భగత్ సింగ్ తో పాటు అసెంబ్లీలో బాంబుదాడిలో పాల్గొన్న బటుకేశ్వర్ దత్ కు ప్రవాస కారాగార శిక్ష విధించింది. భగత్ సింగ్ కు ఉరిశిక్ష విధించడంపై దేశం భగ్గుమంది. భగత్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు వేసిన ఉరిశిక్ష రద్దుచేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగసాగాయి. అదే సమయంలో గాంధీ-ఇర్విన్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఉరిశిక్షనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గాంధీ మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. 1931 మార్చి 24న ముగ్గురు విప్లవకారుల్ని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు ఉరితేదీ సమీపించేకొద్దీ హింసాత్మక రూపు దాల్చాయి. ఈ ఆందోళనలతో బెంబేలెత్తిన బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించిన తేదీ కన్నా ఒకరోజు ముందుగానే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరితీసింది. ముగ్గురు విప్లవకారులు నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడారు. శిక్ష అనుభవించే సమయంలో కూడా వారు విప్లవకారులకే సాధ్యమైన నిబ్బరాన్ని ప్రదర్శించారు. భారత విప్లవకారులు తమ ఆదర్శాల కోసం పెదవులపై చిరునవ్వులు చిందిస్తూ ఎలా మరణిస్తారో మీరు చూడగలుగుతున్నారు అని భగత్ సింగ్ ఉరికి ముందు అక్కడున్న బ్రిటిష్ మెజిస్ట్రేట్ తో వ్యాఖ్యానించారు. విప్లవకారుల ఉరితీత గురించి ఆయన సహచరులతో చెబుతూ జైలర్ భోరున ఏడ్చారు.
ఉరిశిక్ష అనంతరమూ బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరించింది. కుటుంబసభ్యులకు కనీస సమాచారమైన ఇవ్వకుండానే సట్టెజ్ నది ఒడ్డున అమరవీరులకు బ్రిటిష్ ప్రభుత్వం అమానవీయ రీతిలో అంత్యక్రియలు కూడా జరిపించింది. తెలతెలవారుతుండగా విషయం తెలుసుకున్న దేశప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఉరి విషయం తెలియని కుటుంబ సభ్యులు మృతదేహాలు చూసి భోరున విలపిస్తున్న తీరు దేశప్రజల్ని తీవ్రంగాకలిచివేసింది. అంతే స్థాయిలో ఆగ్రహజ్వాలలూ వ్యక్తమయ్యాయి. దేశమంతా ఓ ఉద్విగ్న వాతావరణం. ఆందోళనలు హింసారూపు దాల్చాయి. లక్షలాదిగా యువకులు వీధుల్లోకి తరలివచ్చి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. భగత్ సింగ్ ఉరి కారణంగా తలెత్తిన హింసా కార్యక్రమాల్లో 74 మంది చనిపోయినట్టు బ్రిటిష్ పత్రిక ఒకటి ప్రచురించింది. భగత్ సింగ్ ను ఆనాటి దేశ పౌరులు ఎంతగా ఆరాధించారో చెప్పటానికి అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ 20 ఏళ్ల తర్వాత రాసుకున్న స్వీయచరిత్రలో కొన్నివాక్యాలు ఉదాహరణగా నిలుస్తాయి. భగత్ సింగ్ ఏ తప్పూ చేయలేదు. ఖైదీల బ్యారక్ రాజకీయ వేదికగా మారిపోయింది. భగత్ సింగ్ వీరోచిత గాధలతో గ్రామీణ ప్రాంతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన ఫొటోలను నగరాలలో, పట్టణాలలో ప్రజలు కిక్కిరిసి కొంటున్నారు. కొంతకాలంగా గాంధీకన్నా భగత్ సింగ్ కే ప్రజల్లో ఎక్కవ పలుకుబడి ఉంది. అని బ్రిటిష్ గూఢాచార శాఖ అధిపతి తనతో చెప్పినట్టుగా ఇర్విన్ రాశారు. అలాగే గాంధీ ఇర్విన్ ఒప్పందం సందర్భంగా గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఇర్విన్ తన పుస్తకంలో పొందుపరిచారు.
భగత్ సింగ్ ను ఉరితీస్తే అకస్మాత్తుగా అతను జాతీయస్థాయిలో అమరజీవి అయిపోతాడని, వాతావరణం ఉద్రిక్తంగా మారిపోతుందని, కాబట్టి కాంగ్రెస్ సమావేశం అయిపోయిన తరువాత ఉరి అమలుచేయమని గాంధీ సలహా ఇచ్చినట్టు ఇర్విన్ తెలిపారు. దేశం నలుమూలలా భగత్ సింగ్ పేరు ప్రతిధ్వనిస్తున్న వేళ, ప్రజలంతా గాంధీ అహింసా సిద్దాంతపై నమ్మకం కోల్పోయి విప్లవపార్టీకి ఆకర్షితులవుతున్న తరుణంలో భగత్ సింగ్ తనకు రాజకీయాల్లో పోటీగా అవుతారన్న భయంతోనే గాంధీ-ఇర్విన్ ఒప్పందం సమయంలో గాంధీ ఉరిశిక్ష రద్దుచేయాలని కోరలేదని, తద్వారా భగత్ సింగ్ మరణానికి ఆయన పరోక్ష కారణమయ్యారని కొందరు చరిత్రకారులు ఇప్పటికీ వాదిస్తున్నారు. కారణం ఏదయినప్పటికీ… తాను కలలుగన్న లక్ష్యాల్ని సాధించకుండానే భగత్ సింగ్ కన్నుమూశారు. దేశం కోసం 23 ఏళ్ల చిరుప్రాయంలో నవ్వుతూ ఉరికంబాన్నిముద్దాడారు. ఆయన మరణించిన తరువాత 16 ఏళ్లకు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. కానీ భగత్ సింగ్ కోరుకున్నది ఇలాంటి స్వతంత్రాన్నికాదు.
షహీద్ భగత్ సింగ్ అసలు లక్ష్యం అనంత విప్లవం… సోషలిస్టు సమాజం. ఆయన మరణించిన 88 ఏళ్ల తరువాత కూడా ఆ లక్ష్యం నెరవేరలేదు… కనుచూపు మేరలో నెరవేరే సూచనలూ కనిపించటం లేదు. ఏ సమాజ స్థాపన కోసం భగత్ సింగ్ నవ్వుతూ ఉరికంబం ఎక్కాడో… ఆ ఆశయ సాధన నుంచి దేశ రాజకీయాలు పక్కకు తప్పుకున్నాయి. శాండర్స్ కాల్చివేత, అసెంబ్లీ భవనంపై బాంబుదాడి, ఉరికంబాన్ని ధైర్యంగా ఆహ్వానించటం వంటి లక్షణాలతో దేశం నలుమూలలా భగత్ సింగ్ పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆనాడు ఉడుకు రక్తంతో ఆవేశపూరితంగా ఉన్నకోటాను కోట్ల మంది యువకులలో స్వతంత్రేచ్ఛ రగిలించారు… వారిని స్వాతంత్ర్య పోరాటం వైపుకుఆకర్షించగలిగారు. కానీ విప్లవ లక్ష్యం సాధించలేకపోయారు. భగత్ సింగ్ సాధించాలనుకున్న గొప్ప లక్ష్యాలతోపోలిస్తే దేశ స్వాతంత్ర్యం అనేది చాలా చిన్న అంశం. ఆయన విస్తృత స్థాయి లక్ష్యాలు అంతకన్నా చాలా పెద్దవి.అవి ఏవీ బృహత్తర త్యాగాల తర్వాత కూడా నెరవేరలేకపోయాయి. భగత్ సింగ్, ఆయన స్నేహితులు చూపిన అసమానధైర్యసాహసాలకు రావలసినంత గుర్తింపు రాలేదు. ఆ అమరవీరులకు తగిన ప్రాధాన్యం దక్కిఉంటే
జాతీయోద్యమంలో కాంగ్రెస్ స్థానాన్ని విప్లవపార్టీ ఆక్రమించి ఉండేది. కాంగ్రెస్ పాత్ర అంతటితో ముగిసుండేది.
దేశ స్వాతంత్య్ర పోరాటానికి హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ కేంద్ర బిందువు అయ్యుండేది. దేశ స్వాతంత్య్రంలో
కాంగ్రెస్ ఎలాంటి పాత్ర పోషించిందని ప్రజలంతా ఇప్పుడు భావిస్తున్నారో ఆ స్థానంలో విప్లవపార్టీ ఉంటే.. భగత్
సింగ్ ఆశయాలు కొంతమేరకన్నా నెరవేరి ఉండేవి. అప్పుడు భారతదేశ చరిత్ర మరోలా ఉండేది. కానీ ఇప్పుడు
భగత్ సింగ్ చేసిన విప్లవ రాజకీయాలను ఒక విఫల రాజకీయ ప్రయోగంగా చరిత్రీకరించారు. ఆయన జీవిత
చరిత్రను భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో కేవలం ఒక అధ్యాయంగా మార్చివేశారు. ఇది అత్యంత
బాధాకరం. భగత్ సింగ్ చాలా చదివారు. చాలా అర్ధం చేసుకున్నారు. ఒక లక్ష్యం ఏర్పరుచుకున్నారు. ఆ లక్ష్యం
80 ఏళ్ల క్రితమో…ఇప్పుడో కాదు… అసలు ఈ భూమి ఉన్నంత కాలం ఎప్పుడైనా నెరవేరుతుందా అన్నది సందేహమే.