మొదటిసారి రుణాలు తీసుకునే వారి విషయంలో బ్యాంకులు ఆసక్తి చూపించడం లేదు. వారికి బదులు ప్రస్తుత రుణ గ్రహీతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది. పండుగల సీజన్ ముగిసిపోయిన తర్వాత కూడా రుణాలకు డిమాండ్ పెరుగుతూనే ఉందని వెల్లడించింది. వినియోగంతోపాటు, వ్యక్తిగత రుణాలు డిమాండ్‌కు మద్దతుగా ఉన్నట్టు పేర్కొంది.
‘‘2021 నవంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో మొదటిసారి కస్టమర్లకు ఇచ్చే రుణాల వాటా 14 శాతానికి తగ్గిపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 16 శాతంగా, 2019 సంవత్సరం ఇదే కాలంలో 17 శాతంగా ఉంది’’అని సిబిల్ పేర్కొంది. ఎన్‌టీసీ కస్టమర్ల విషయంలో బ్యాంకులు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. ఎన్‌టీసీ విభాగంలో రుణాల అనుమతుల రేటు 27 శాతానికి తగ్గిందని, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 30 శాతంగా ఉన్నట్టు వివరించింది.
రుణాలకు డిమాండ్ పెరుగుతూనే ఉందని, కన్జన్యూమర్ రుణాలకు 97 శాతం వృద్ధి ఉంటే, వ్యక్తిగత రుణాలకు డిమాండ్ 80 శాతం పెరిగినట్టు సిబిల్ నివేదిక తెలిపింది.పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా 2022 జనవరిలో రుణ విచారణలు 33 శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2021 జనవరిలో 10 శాతం క్షీణత ఉన్నట్టు పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలకు రిస్క్ ఎక్కువని, విలువ తరిగిపోయే ఆస్తులుగా పేర్కొంది. ద్విచక్ర వాహనాల విభాగంలో చెల్లింపులు చేయని రుణాలు 3.64 శాతానికి పెరిగాయని తెలిపింది.