లివింగ్‌స్టోన్‌ ప్రశంసల వర్షం

లివింగ్‌స్టోన్‌ ప్రశంసల వర్షం

ఇంగ్లండ్‌ కౌంటీల్లో చెలరేగిపోతున్న పాకిస్థాన్‌ బౌలర్‌ హసన్‌ అలీపై పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2022లో లాంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్‌ అలీ గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో లివింగ్‌స్టోన్‌ పాక్‌ పేసర్‌ని కొనియాడాడు. లివింగ్‌స్టోన్‌కు లాంకాషైర్‌ హోం టీమ్‌ కావడంతో హసన్‌ అలీ ప్రదర్శనను ఆకాశానికెత్తుతూ, తన జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. వాట్‌ ఎ సైనింగ్‌.. వాట్‌ ఎ విన్‌ అంటూ రెడ్‌ రోసెస్‌తో హసన్‌ అలీకి, లాంకాషైర్‌ జట్టుకు విషెస్‌ తెలిపాడు.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌ వన్‌లో భాగంగా గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్‌ ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన హసన్‌.. లాంకాషైర్‌ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో గ్లోస్టర్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్‌ కాగా.. లాంకాషైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 556 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. లంకాషైర్‌ జట్టులో జోష్‌ బొహానన్‌  డబుల్‌ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్‌ డేన్‌ విలాస్‌ సెంచరీతో సత్తా చాటాడు.