వినువీధిలో మరో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఎప్పుడో గూటెన్‌బర్గ్ ప్రింటింగ్ ప్రెస్‌ను కనుగొన్నప్పుడు సుదీర్ఘంగా ఏర్పడిన పాక్షిక చంద్రగ్రహణం మళ్లీ ఏర్పడబోతోంది.ఈ శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్రగహణం ఈ రోజు న ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సమయాల్లో కనువిందు చేసే ఈ గ్రహణం దాదాపు 600 ఏళ్ల తర్వాత ఏర్పడుతోందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చంద్రగ్రహణం ఉచ్ఛస్థితికి చేరుతుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే.
అంతేకాదు, చివరిసారిగా 1,440లో ఇటువంటి గ్రహణం ఏర్పడింది.చంద్రుడు, సూర్యుడి, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చి.. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం 3.28 గంటలపాటు కొనసాగనుంది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 99 శాతం ఎర్రగా కనిపిస్తుందని, చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుందని నాసా తెలిపింది. ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే కావడం గమనార్హం.
అరుణ వర్ణంలో చంద్రుడు కనిపించడాన్ని బ్లడ్ మూన్ , సూపర్ మూన్ గా పిలుస్తారు. భారత్‌లో ఈ గ్రహణం అసోం, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించనుంది. అలాగే ఉత్తర అమెరికాలోని 50 దేశాలతో పాటు మెక్సికోలోనూ కనువిందు చేయనుంది. అమెరికా తూర్పు తీరంలో ఈ అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల వరకూ చూడొచ్చు.
పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా పేర్కొంది. ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది.
భారత్‌లో కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడుతున్న ఈ గ్రహణాన్ని.. మంచుతో కప్పబడిన చంద్రుడి ఫ్రాస్ట్ మూన్ గా అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరత్‌కాలంలో చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరును సూచించాయి. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పూర్తిగా కప్పివేసే సంపూర్ణ చంద్రగ్రహణంలా ఇది అద్భుతమైనది కానప్పటికీ, ఈ పాక్షిక గ్రహణం చంద్రుని ఉపరితలంలో 99% కనిపించకుండా దాచేస్తుంది.
గ్రహణం ప్రారంభమై భూమి ప్రతిబింబం బయటి నీడలోకి ప్రవేశించినప్పుడు చంద్రుడు కొంచెం మసకబారినట్లు కనిపిస్తాడని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్పారు. ఒక గంట తర్వాత చంద్రుని ఎవరో పెద్ద కాటు వేసినట్లు కనిపిస్తుంది.. అది నీడలోకి వెళ్లడం ప్రారంభమవుతుంది. తర్వాత చంద్రుడు ఎరుపు రంగులో కనిపించి, 18 నిమిషాల తర్వాత గ్రహణం ఉచ్ఛస్థితికి చేరుకుని అత్యంత స్పష్టమైన రంగులో కనిపిస్తుంది.
జోహన్నెస్ గూటెన్‌బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న సమయంలో 1440లో ఇటువంటి సుదీర్ఘమైన పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడింది. తిరిగి 2,669లో మళ్లీ ఇలా ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది నవంబరు 8న సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని NASA తెలిపింది. ఈ గ్రహణాన్ని నేరుగా చూడవచ్చని తెలిపింది.