580 ఏళ్లలో సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం భారతకాలమానం ప్రకారం నవంబరు 19 న మధ్యాహ్నం 12.48 గంటలకు కనిపించనుంది. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది అని ఎంపీ బిర్లా ప్లానిటోరియం పరిశోధన & అకడమిక్ డైరెక్టర్ డెబిప్రోసాద్ దుయారీ తెలిపారు. పాక్షిక గ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. గ్రహణం కాలవ్యవధి 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుంది. ఇది 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైనది అని మిస్టర్ దుయారీ తెలిపారు.
చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న పాక్షిక చంద్రగ్రహణం సంభవించిందని, మళ్లీ అద్భుతాన్ని ఫిబ్రవరి 8, 2669న చూడవచ్చని ఆయన చెప్పారు. చంద్రుడు, సూర్యుడి, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. అప్పుడు చంద్రునిలో 97 శాతం భూమి నీడతో కప్పబడి ఉంటుంది. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన సమయంలో చంద్రుడు ఎరుపు రంగును పొందుతాడు. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుందని పేర్కొంది. ఈ చంద్రగ్రహణం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు ఉండనుంది.
ఈ పాక్షిక చంద్ర గ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే కాగా.. మే 26 న వైశాఖ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరత్‌కాలంలో చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరును సూచించాయి.