మ‌రో మ‌హిళ కోసం భార్య హ‌త్య‌

Man killed His Wife for Another Women

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగిన ప్రియా మెహ్రా హ‌త్య దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రూ. 40ల‌క్ష‌ల అప్పుకోసం భార్య ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన పంకజ్ వైఖ‌రి చూసి అంద‌రూ షాక్ తిన్నారు. మంగ‌ళ‌వారం రాత్రి ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని షాలిమ‌ర్ బాగ్ లో ప్రియ గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు జ‌రిపిన కాల్పుల్లో చ‌నిపోయింది. భ‌ర్త పంక‌జ్ , కుమారుడుతో క‌లిసి గురుద్వారాకు వెళ్లి ఆమె కారులో తిరిగి వ‌స్తుండ‌గా..కాల్పులు జ‌రిగాయి. బుల్లెట్లు మీద‌కు దూసుకొస్తున్నా…ప్రియ రెండేళ్ల కుమారుణ్ని సీటు వెన‌క‌ల దాచి కాపాడుకుంది. ఆమె మాత్రం కాల్పుల్లో చ‌నిపోయింది. కేసు ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు…ప్రియామెహ్రాకు ఎక్కువ బుల్లెట్లు త‌గ‌ల‌డం, పంక‌జ్ మాత్రం స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డడంపై సందేహం తలెత్తింది. అత‌న్ని అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు నిజం వెల్ల‌డించాడు.

ఓ వ్య‌క్తి ద‌గ్గ‌ర తీసుకున్న రూ. 40ల‌క్ష‌ల అప్పు తీర్చ‌లేక‌.. త‌న భార్య‌ను చంపించి, ఆ నేరాన్ని అప్పు ఇచ్చిన వ్య‌క్తిపై తోయాల‌ని  ప‌థ‌కం ర‌చించిన‌ట్టు పంక‌జ్ పోలీసుల‌కు వెల్ల‌డించాడు. ఈ విష‌యాన్నే పోలీసులు మీడియాకు వివ‌రించారు. ఒక్క‌రాత్రి విచార‌ణ‌లోనే పంక‌జ్ నేరం ఒప్పుకున్నాడ‌ని పోలీసులు తెలిపిన‌ప్ప‌టికీ..ఈ హ‌త్య‌కేసుపై అన‌క సందేహాలు తలెత్తాయి. డ‌బ్బుకోసం పంక‌జ్ ఇలా చేశాడంటే ఎవ‌రూ న‌మ్మ‌లేదు. భార్య‌ను ప్రేమించే ఏ వ్య‌క్తీ…ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ..ఇలాంటి దారుణానికి ఒడిగ‌ట్ట‌రు. విచార‌ణ‌లో పంక‌జ్ వెల్లడించిన‌ట్టు డ‌బ్బు కోస‌మే భార్య‌ను హ‌త్య‌చేయిస్తే…ఇక త‌రువాత జీవిత‌మంతా భార్య లేకుండా అత‌ను ఎలా బ్ర‌త‌క‌గ‌ల‌డు? ..డ‌బ్బు స‌మ‌స్య తీరిపోయిన త‌ర్వాత భార్య లేద‌న్న బాధ అత‌న్ని వేధించ‌దా? ఇలాంటి ఎన్నో సందేహాలు క‌లిగాయి.. డ‌బ్బు స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికీ…అంత‌కు మించిన‌ మ‌రేదో కార‌ణం పంక‌జ్… భార్య‌ను హ‌త్య‌చేయించ‌డానికి దారితీసుంటుంద‌న్న అభిప్రాయం వినిపించింది. 
తాజాగా వ‌స్తున్న వార్త‌లు ఆ అభిప్రాయాన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. పంక‌జ్ వివాహేత‌ర బంధ‌మే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. రెస్టారెంట్ లో ప‌నిచేస్తున్న ఓ సింగ‌ర్ తో పంక‌జ్ కు వివాహేత‌ర బంధం ఉంద‌ని, ఆమెతో క‌లిసి జీవించేందుకే భార్య‌ను హ‌త్య‌చేయించాడ‌ని తెలుస్తోంది. దీనిపై  పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్ల‌డించ‌లేదు. మ‌రోవైపు పంక‌జ్ చేసిన దారుణంపై ప్రియ త‌ల్లిదండ్రులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.పంక‌జ్ ను కేవ‌లం విచారించి, జైల్లో పెట్ట‌డం కాకుండా  ఉరితీయాల‌ని  వారు కోరుతున్నారు. ప్రియ‌, పంక‌జ్ ప్రేమించి వివాహం చేసుకున్నార‌ని, అత‌ను ఇలా త‌మ కుమార్తెను హ‌త్య చేస్తాడ‌ని అస‌లు ఊహించ‌లేద‌ని ప్రియ తండ్రి తెలిపారు.