భూతవైద్యురాలి హత్య

భూతవైద్యురాలి హత్య

తనను దూరంగా పెట్టిందని పథకం ప్రకారమే ఓ వివాహితను ప్రియుడే అత్యాచారానికి పాల్పడి.. ఆపై హత్య చేసి నగలు ఎత్తికెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు వివరాలను మంగళవారం మిడ్జిల్‌ పోలీస్‌స్టేషన్‌లో జడ్చర్ల రూరల్‌ సీఐ జములప్ప వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలోని మల్లాపూర్‌కు చెందిన లక్ష్మీదేవి గత నెల 22వ తేదీ ఉదయం తన కూతురు స్వాతిని కల్వకుర్తికి చెందిన వెంకటేశ్వరాచారితో కలిసి జడ్చర్లకు తీసుకెళ్లింది.అక్కడి హాస్టల్‌లో కూతురిని వదిలిపెట్టి తిరిగి అదేరోజు సాయంత్రం మున్ననూర్‌ వద్ద దిగిపోయింది.

ఎంతకూ ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు భర్త శంకరయ్యగౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బోయిన్‌పల్లి శివారులో సీతాఫలాల కోసం వెళ్లిన రవిప్రకాష్‌రెడ్డికి పీర్లమాన్యంగుట్టపై ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా హత్యకు గురైన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ దొరికిన ఆమె ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా మృతురాలు గ్రామంలో భూతవైద్యం చేసేదని బయటపడింది.ఆ కోణంలో విచారణ జరపగా మల్లాపూర్‌కు చెందిన గంగిరెద్దుల వెంకటయ్యకు లక్ష్మీదేవితో వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది.

ఇటీవల అతడిని దూరం పెట్టడంతో ఎలాగైనా చంపేసి బంగారు నగలు తీసుకోవాలని పథకం పన్నాడు. పీర్లమాన్యంగుట్టలో బంగారు గనులు ఉన్నాయని వాటిని తీయాలని నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం జరిపి, పెద్ద బండరాయితో మోది చంపేసి ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారు పుస్తెలతాడు, నక్లెస్‌ తోపాటు తులం చైన్, మూడు గ్రాముల చెవికమ్మలు తీసుకుని పారిపోయాడు. చివరకు మంగళవారం నిందితుడిని అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును పది రోజుల్లోనే ఛేదించిన ఎస్‌ఐ జయప్రసాద్, ట్రెయినీ ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌ను సీఐ అభినందించారు.