నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

ఒడిశాకు చెందిన రమేశ్ చంద్ర అలియాస్ బిభు ప్రకాశ్ స్వైన్‌ తనను తాను డాక్టర్‌గా చెప్పుకుంటూ మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్‌, ఢిల్లీ, అసోం, ఝార్ఖండ్‌, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాలకు చెందిన మహిళలను తన వలలోకి దింపి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు విచారణలో మరిన్ని వాస్తవాలు బయటపడ్డాయి. బాధితుల జాబితాలో 25 మందికిపైగా మహిళలు ఉన్నట్టు వెల్లడయ్యింది. అంతేకాదు, మరో రెండు వారాల్లో ఇంకో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి పోలీసులే అవాక్కయ్యారు.

తీగ లాగితే డొంక కదిలినట్టు ఇతగాడి రాసలీలలు చిట్టా ఒక్కొక్కటిగా బయటపడటంతో అధికారులు నోరెళ్లబెడుతున్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్టు మ్యాట్రిమోనియల్‌ సైట్స్‌ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని, ప్రొఫెసర్లు, లాయర్లు, మెడికోలను మోసపూరితంగా పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తనకు భారీగా జీతం వస్తుందని నమ్మించడానికి నకిలీ గుర్తింపు కార్డులు, అపాయింట్‌మెంట్ లెటర్లు ఉపయోగించాడని వివరించారు. డబ్బు మీద ఉన్న ఆశతో పాటు లైంగిక ఆనందం కోసం ఇలా చేసినట్టు గుర్తించారు.

పెళ్లి తర్వాత కొద్ది రోజులు వారితో సంతోషంగా గడిపి.. అత్యవసరమని చెప్పి వారి నుంచి డబ్బులు, నగలు తీసుకుని అటు నుంచి అటే ఉడాయించేవాడని తెలిపారు. 25 మందికిపైగా మహిళలను వివాహం చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అతడి మొబైల్‌లో మేడమ్ ఢిల్లీ, మేడమ్ అసోం, మేడమ్ యూపీ పేర్లతో కాంటాక్టులు సేవ్ చేసినట్టు గుర్తించారు.

ఢిల్లీకి చెందిన 14వ భార్య గతేడాది మేలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె కనీసం ఏడుగుర్ని పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొందని, దర్యాప్తు జరిగే కొద్దీ బాధితుల జాబితా పెరిగిందని పోలీసులు చెప్పారు. బాధితురాలు మోసపోయినట్టు గ్రహించి, ఇతర భార్యల కాంటాక్టులను ఫోన్‌లో నుంచి అతడి తెలియకుండా సేకరించి, వ్యక్తిగతంగా కలిసిందన్నారు. విచారణలో అతడి మోసం, వంచన సుదీర్ఘ చరిత్ర గురించి వెల్లడయ్యిందన్నారు.

కేంద్రపర జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన స్వైన్.. ల్యాబ్ టెక్నీషియన్‌ శిక్షణ తీసుకున్నాడు. తొలిసారిగా 1978లో వివాహం జరగ్గా.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ముగ్గురూ వైద్యులే కావడం విశేషం. మొదటి భార్య, పిల్లలను వదిలేసి 2002లో భువనేశ్వర్‌కు వచ్చేసి ఓ వైద్యురాలిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వివిధ పేర్లతో మ్యారేజ్ బ్యూరో వెబ్‌సైట్స్‌ ద్వారా పలు రాష్ట్రాలకు చెందిన మహిళలను బుట్టులో వేసుకున్నాడు.

అంతేకాదు, 128 నకిలీ క్రెడిట్ కార్డులతో 13 బ్యాంకులను రూ. కోటి మేర మోసం చేశాడు. మెడికల్ ల్యాబొరేటీలను పలు చోట్ల ఏర్పాటుచేసి అక్కడ వైద్యులు, ఇతర సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు దర్యాప్తులో గుర్తించారు.