నిద్రిస్తున్న మహిళపై వెళ్లిన లారీ

నిద్రిస్తున్న మహిళపై వెళ్లిన లారీ

పిల్లలకు భారంగా ఉండకూడదు.. నగరంలో ఏదైనా పనిచేసుకొని బతుకుదామని వచ్చిన ఆ దంపతులను విధి వెక్కిరించింది. ఉద్యోగంలో చేరిన 12 గంటలలోపే భార్యను మృత్యువు కబళించింది. నిద్రిస్తున్న మహిళపై లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కె.నర్సింహ, ఎస్‌ఐ శ్రీలతరెడ్డి తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా అడ్డాకూల గ్రామానికి చెందిన దంపతులు వెంకటమ్మ, రామస్వామి నగరంలో వాచ్‌మెన్‌గా పనిచేసేందుకు వచ్చారు. బుధవారం సాయంత్రం దుర్గానగర్‌ చౌరస్తాలోని ఓ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా భార్యభర్తలు పనికి కుదిరారు. భోజనం చేసుకొని పనులు కొనసాగుతున్న ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు.

కరెంటు లేకపోవడం, దోమల బెడద తీవ్రంగా ఉండడంతో ఇంటికి సమీపంలో పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ లారీ ఇటుకలను ఆ ఇంటి వద్ద దించేందుకు వచ్చింది. డ్రైవర్‌ యాదగిరి.. రోడ్డుపై పడుకున్న వెంకటమ్మ, రామస్వాములను గమనించకుండా రివర్స్‌లో వచ్చాడు. ఆ సమయంలో వెంకటమ్మపైనుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇద్దరు కూతుళ్లు, కుమారుడు వచ్చి గుండెలవిసేలా రోదించారు. ఇలా చావడానికే ఇక్కడకు వచ్చావా.. అమ్మా.. అని వారు రోదించడం కంటతడిపెట్టించింది.