తాజాగా శుక్రవారం సాయంత్రం దేశంలో నమోదైన Omicron Cases వివరాల్ని యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 358 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది. ఇందులో 244 యాక్టివ్ కేసులు ఉన్నట్లు, 114 మంది పేషెంట్లు ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో అధికంగా 88, ఢిల్లీలో 67, తెలంగాణ 38, తమిళనాడు 34, కర్ణాటక 31, గుజరాత్ 30, కేరళ 27, రాజస్థాన్ 22 కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది.
హర్యానా, ఒడిషా, జమ్ము కశ్మీర్, ఏపీ, యూపీ, ఛండీగఢ్, లడక్‌లలో కేసులు నమోదు అయ్యాయి.ఒక్కరోజులో 122కేసులు రావడం ఆందోళన కలిగించే అంశమని కేంద్రం ప్రకటించింది. వారం కిందట వంద కేసులు, మంగళవారం నాటికి 200 కేసుల మార్క్‌ను చేరుకోగా.. శుక్రవారం నాటికే 350 మార్క్ దాటడం విశేషం. కేసుల్లో 27 శాతం పేషెంట్లు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని, స్థానికంగానే వ్యాప్తిచెందిందని వెల్లడించింది. అంతేకాదు 91 శాతం ఒమిక్రాన్ పేషెంట్లు వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లే కావడం గమనార్హం.
ఈ తరుణంలో బూస్టర్‌షాట్ చర్చలు పరిశీలిస్తోంది కేంద్ర ఆరోగ్యశాఖ.ఇక మొత్తం 108 దేశాల్లో లక్షన్నర కేసులు ఒమిక్రాన్ వేరియెంట్‌కు సంబంధించినవి వెలుగుచూశాయి. యూకేలోనే 90వేలు, డెన్మార్క్‌లో 30వేలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా ఒమిక్రాన్‌కు సంబంధించి 26 మరణాలు నమోదు అయ్యాయి. డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ప్రభావం తక్కువే అయినా.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.