“భయ పెట్టి సాధించిన గెలుపు ఎప్పటికీ నిలబడదు” : పవన్ కళ్యాణ్

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ వైసీపీ చేస్తున్న దాడుల్ని తీవ్రంగా ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భయ పెట్టి సాధించిన గెలుపు ఎప్పటికీ నిలబడదన్నారు. స్థానిక ఎన్నిక విజన్‌ను బీజేపీ-జనసేన పార్టీలు విడుదల చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయన్న విషయం తెలిసిందే. 151 మంది ఎమ్మెల్యేలున్నా అధికార పార్టీ వైసీపీ ఎన్నికలంటే ఎందుకు భయం పడుతుందన్ని పవన్ ప్రశ్నించారు. కొందరు పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. నామినేషన్లకు ఇంత హింస సృష్టిస్తారా అంటూ మండిపడ్డారు పవన్. ఏక గ్రీవం చేయాలనుకున్నప్పుడు ఎన్నికలు ఎందుకంటూ పవన్ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డియే ఏకగ్రీవం చేసుకొని ప్రకటించుకుంటే సరిపోతుందన్నారు. దీనికి రాష్ట్ర ఈసీదే బాధ్యత అన్నారు పవన్ కళ్యాణ్.

శేషన్ లాంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇన్నాళ్ల చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి హింస జరగలేదన్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంతమైన జిల్లాల్లో కూడా భయబ్రాంతులను గురి చేస్తున్నారన్నారు. గోదావరి జిల్లాల్లో కూడా రైతుల్ని ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, జనసేన కార్యకర్తలు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని నిలబడ్డాలన్నారు. అభ్యర్థులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.