Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ వాసుల 56 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దేశంలోనే రెండో అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన సర్దార్ సరోవర్ డ్యామ్ ను ప్రధానమంత్రి మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా జాతికి అంకితం చేశారు. 1961లో అప్పటి ప్రధాని నెహ్రూ ప్రాజెక్టుకు శంకుస్థాపనచేస్తే…56 ఏళ్ల తర్వాత మోడీ ప్రారంభించారు. సుదీర్ఘ కాలం పాటు నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ కు 1961 నుంచి ఇప్పటిదాకా రూ.65వేల కోట్లు ఖర్చయ్యాయి. గుజరాత్ ప్రజల తాగు, సాగునీటి సమస్యలకు చరమగీతం పాడే సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మించాలనేది భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కల.
ప్రాజెక్టు నిర్మాణంపై 1945లో పటేల్ ఆలోచన చేశారు. అనంతర కాలంలో ముంబైకి చెందిన ప్రముఖ ఇంజినీర్ జమ్దేశ్ జీ దీనికి ప్లాన్ గీశారు. 1961 ఏప్రిల్ 15న నెహ్రూ శంకుస్థాపన చేశారు. తర్వాత దీనిపై అనేక వివాదాలు చెలరేగాయి. పర్యావరణం, పునరావాసం తదితర అంశాలకు సంబంధించిన వివాదాలు ప్రాజెక్టు నిర్మాణంలానే సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నాయి. చివరకు నర్మద నిర్వహణ సంస్థ తుది ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు ఖరారుచేసింది. జూన్ 17న డ్యామ్ గేట్లు మూసివేసి ఎత్తును పెంచారు. దీంతో సర్దార్ సరోవర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4.73 మిలియన్ ఎకరపు అడుగులకు పెరిగింది.
ఈ ప్రాజెక్టుతో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు ప్రయోజనం కలగనుంది. ప్రాజెక్టు ద్వారా 86,088 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు తాగునీటి సౌకర్యం లభించనుంది. నిర్మాణానికి ఉపయోగించిన కాంక్రీట్ పరంగా చూస్తే సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రపంచంలోనే రెండో పెద్ద ప్రాజెక్టు. అమెరికాలోని గ్రాండ్ కౌలీ డ్యామ్ తర్వాత అత్యంత ఎక్కువ కాంక్రీట్ ఉపయోగించింది దీనికే. డ్యామ్ పొడవు1.2 కిలోమీటర్లు కాగా, జలాశయం లోతు 163 మీటర్లు. దాదాపు 30 గేట్లున్న సాగర్ సరోవర్ డ్యామ్ లో ఒక్కో గేటు బరువు 450 టన్నులకు పైగా ఉంటుంది. ఒక గేటు మూయాలంటే గంట పడుతుంది. నర్మదా నదిపై ఉన్న 30 ఆనకట్టల్లో ఈ డ్యామ్ అత్యంత కీలకమైనది. డ్యామ్ పూర్తిగా నిండితే దాదాపు ఆరేళ్లపాటు తాగు, సాగునీటికి లోటుండదు.