తల్లిదండ్రులకు హెచ్చరిక

తల్లిదండ్రులకు హెచ్చరిక

స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడకూడదని పిలల్లకు పెద్దలు ఎపుడూ చెబుతుంటారు. ఫోన్ స్క్రీన్ ఎక్కువ సేపు చూడడం వల్ల కళ్లకు ప్రమాదమని, చదువుపై ప్రభావం పడుతుందని చిన్నారులను తల్లిదండ్రులు హెచ్చరిస్తుంటారు. అది నిజమే. మరి తల్లిదండ్రులు అధికంగా స్మార్ట్‌ఫోన్‌లు వాడుతుండడం వల్ల పెద్ద ప్రమాదమే ఉందన్న హెచ్చరికలు చేసింది ఓ అధ్యయనం. పిల్లలు దగ్గరగా ఉన్నప్పుడు ఫోన్‌ ఎక్కువగా వాడడం వల్ల బంధానికి ఎలా ప్రమాదమో స్పష్టం చేసింది. అలాగే ఫోన్‌ల వాడకం వల్ల తల్లిదండ్రులు, చిన్నారుల మధ్య బంధం ఎలా ప్రభావితమవుతుందో వెల్లడించింది.

ప్రస్తుతం పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్‌ నిత్యం వాడే పరికరంలా మారిపోయింది. ఫోన్‌ లేనిదే ఏ పనీ సాగని పరిస్థితికి వచ్చేశాం. ఇక నిత్యం బంధువులు, స్నేహితులతో ముచ్చటించేందుకు ఇదే మార్గంగా మారింది. కరోనా వైరస్ ప్రవేశించాక ఇక స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిపోయింది. సన్నిహితులతో మాట్లాడడం, చాట్ చేయడం దగ్గరి నుంచి సినిమాలు, వీడియోలు, సంగీతంతో ఎంటర్‌టైన్ అయ్యేందుకు కూడా స్మార్ట్‌ఫోన్‌నే వాడుతున్నారు.

కొవిడ్ కంటే ముందుతో పోలిస్తే ఇప్పుడు సగటున ఫోన్‌ వాడకం సమయం 32శాతం పెరిగిందట. అయితే స్మార్ట్‌ఫోన్‌ల వాడకం మానవ సంబంధాలు ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తోందన్న విషయంపై స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ వివో, సైబర్ మీడియా రీసెర్చ్ కలిసి అధ్యయనం చేశాయి. మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావం-2021 పేరుతో ఈ స్టడీ వివరాలను వెల్లడించాయి.

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న సమయంలో పిల్లలు ఎటు వెళుతున్నారో కూడా చూసుకోవడం లేదని 69శాతం మంది తల్లిదండ్రులు చెప్పారని అధ్యయనం వెల్లడించింది. ఫోన్‌ వాడుతున్న సమయంలో వారు అసలు పిల్లలను పట్టించుకోవడం లేదట. అలాగే ఫోన్‌ వాడుతున్న సమయంలో పిల్లలు ఏదైనా అడిగితే 74శాతం మంది తల్లిదండ్రులు చిరాకు పడుతున్నారు. వీటి ద్వారా తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని, పిల్లల మనసు నొచ్చుకుంటోందని అధ్యయనం వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్‌ అధిక వాడకం వల్ల బంధాలు ప్రభావితమవుతున్నాయని పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. మరోవైపు పిల్లలు కూడా ఎమోషనల్ గా, మానసిక ఆరోగ్యం పరంగా కూడా ప్రభావితమవుతున్నారు. తాము ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న సమయంలో పిల్లలు అసహనానికి, కోపానికి గురవుతున్నారని దాదాపు90 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారని అధ్యయనం పేర్కొంది. అలాగే చిన్నారుల ప్రవర్తనలోనూ మార్పులు వస్తున్నాయని చెప్పింది.

లాక్ డౌన్ల నుంచి ప్రజలు సగటున స్మార్ట్‌ఫోన్‌ను ఎంత సమయం వాడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ అధ్యయనం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. రోజుకు సగటున 6.5 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నామని ప్రజలు వెల్లడించారని ఈ స్టడీ పేర్కొంది. కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో ఫోన్‌ను వదల్లేకపోతున్నామని 75 శాతం మంది చెప్పారు.

ఇలా మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్‌లు అధిక ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పిల్లలతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఫోన్‌లను వాడడం అంత మంచిది కాదు. చిన్నారులతో సమయం గడుపుతూ.. వారితో ముచ్చటించాలి. వారి అభిప్రాయాలను, ఇష్టాలను తెలుసుకోవాలి. వారికే తాము ప్రాధాన్యమిస్తున్నట్టు నడుచుకోవాలి. అలాగైతేనే పిల్లలతో తల్లిదండ్రుల బంధం బలంగా ఉంటుంది.