బాలీవుడ్ లో రీమేక్ అవ్వబోతున్న టాక్సీవాలా

బాలీవుడ్ లో రీమేక్ అవ్వబోతున్న టాక్సీవాలా

ఒక దక్షిణాది సినిమా ఇంకా విడుదల కాకముందే ఓ బాలీవుడ్ అగ్ర నిర్మాత దాని రీమేక్ హక్కులు కొనడం అన్నది అరుదైన విషయం. విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విషయంలో ఇదే జరిగింది. కరణ్ జోహార్ లాంటి టాప్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఈ సినిమా ప్రివ్యూ చూసి తెగ నచ్చేసి దాన్ని హిందీలో తాను రీమేక్ చేయనున్నట్లు ప్రకటించాడు. కానీ కరణ్ పొగిడిన స్థాయిలో సినిమా లేకపోవడంతో తెలుగులో ఈ చిత్రం సరిగా ఆడలేదు. కట్ చేస్తే బాలీవుడ్ రీమేక్ గురించి తర్వాత డిస్కషనే లేదు.

మరి రిలీజ్ ముంగిట హైప్ కోసం రీమేక్ అంటూ హడావుడి చేశారో ఏమో తెలియదు. దీని సంగతి ఎటూ తేలకుండా ఉంటే.. ఇప్పుడు విజయ్ నటించిన పాత సినిమా ఒకటి బాలీవుడ్లో రీమేక్ కాబోతుండటం విశేషం. ఆ చిత్రమే.. ట్యాక్సీవాలా.

గత ఏడాది ‘నోటా’తో ఎదురు దెబ్బ తిన్న సమయంలో విజయ్‌కు మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం ‘ట్యాక్సీవాలా’. అనేక సందేహాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో ‘ధడక్’ ఫేమ్ ఇషాన్ ఖట్టర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ప్రియాంక జవాల్కర్ పాత్రను అనన్య పాండే చేస్తోంది. ఈ చిత్రానికి ‘ఖాలి పీలి’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. మక్బూల్ ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

సల్మాన్ ఖాన్‌తో ‘సుల్తాన్’, ‘భారత్’ సినిమాలు తీసిన అలీ ఆబ్బాస్ జాఫర్.. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ‘ఖాలి పీలి’ని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఖరారైపోయింది. వచ్చే ఏడాది జూన్ 12న ‘ఖాలి పీలి’ని ప్రేక్షకుల ముందుకు తెస్తారట. మరి తెలుగులో మాదిరే హిందీలోనూ ఈ చిత్రం సర్ప్రైజ్ హిట్ అవుతుందేమో చూడాలి.