‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019’ జాబితాలో విజయ్‌ దేవరకొండ

‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019’ జాబితాలో విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌ టైమ్స్‌ రిలీజ్‌ చేసిన ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019’ జాబితాలో విజయ్‌ దేవరకొండ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మీ ప్రేమ విషయం గురించి చెప్పండి అన్న ప్రశ్నకు అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ముక్కుసూటిగా జవాబిచ్చాడు. ఒకవేళ తాను ప్రేమలో పడినప్పటికీ ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతానని తెలిపాడు. తన పర్సనల్‌ విషయం అందరికీ వినోదంగా మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని పేర్కొన్నాడు.

కేవలం ఆ సీక్రెట్‌ను తన తల్లిదండ్రులకు, స్నేహితులకు మాత్రమే చెప్తానని చెప్పుకొచ్చాడు. అందరికీ చాటింపు చేయడం నచ్చదని, అది ఎవరి వ్యాపారమూ కాదని రౌడీ ఘాటుగానే జవాబిచ్చాడు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అందరికీ బహిర్గతం చేస్తానన్నాడు. ఇక సినిమాల పరంగా ఎవరితోనైనా నటించేందుకు సిద్ధమేనని, అయితే బాలీవుడ్‌ హీరోయిన్లు కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌లతో నటించాలని ఉందని మనసులో మాట చెప్పుకొచ్చాడు.