వినోద్‌ కాంబ్లీ ప్రశంసల వర్షం

వినోద్‌ కాంబ్లీ ప్రశంసల వర్షం

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తుమ కెప్టెన్‌ అంటూ కోహ్లిని కొనియాడాడు. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించి తప్పుచేశారని అభిప్రాయపడ్డాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 113 పరుగుల తేడాతో గెలుపొంది సెంచూరియన్‌లో చరిత్ర సృష్టించింది. సఫారీల కంచుకోటలో జయకేతనం ఎగురవేసిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది.

ఈ నేపథ్యంలో కోహ్లి సారథ్యంలోని భారత జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వినోద్‌ కాంబ్లీ సైతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ సామాజిక మాధ్యమం ‘కూ’ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. అదే విధంగా కోహ్లి కెప్టెన్సీ గురించి ప్రస్తావిస్తూ అతడి ప్రతిభను కొనియాడాడు. ఒత్తిడిలోనూ జట్టును విజయతీరాలకు చేర్చి గొప్ప సారథిగా నిరూపించుకున్నాడన్నాడు.

ఈ మేరకు… ‘‘కెప్టెన్సీ మార్పు గురించి చర్చోపర్చలు. వాతావరణం కూడా పెద్దగా సహకరించలేదు! కానీ.. మనం అద్భుతాలు చేశాం. ప్రపంచంలోని బెస్ట్‌ కెప్టెన్‌ అని తనను ఎందుకు పిలుస్తారో కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే… సిరీస్‌ ముగిసే లోపు పాత కోహ్లిని మనం చూస్తాం’’ అని కాంబ్లీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ కోహ్లికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో తనతో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరుపకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారంటూ కోహ్లి వ్యాఖ్యానించడం వివాదానికి తెరతీసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లిన టీమిండియా కోహ్లి నేతృత్వంలో సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం. ఇక వరణుడు ఆటంకం సృష్టించినా పేసర్ల విజృంభణతో కోహ్లి సేన గెలుపొందిన సంగతి తెలిసిందే.