ఇన్స్టంట్ మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఐపీ సర్వీస్ అయిన వాట్సాప్, భారతీయులకు భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 20 లక్షల మంది అకౌంట్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెలలోనే ఈ ఫిగర్ నమోదైందని పేర్కొంది వాట్సాప్.
ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అక్టోబర్‌లోనే మొత్తంగా.. ఇరవై లక్షల 69 వేల అకౌంట్లను నిషేధించింది. వాట్సాప్‌లో అభ్యంతరకర ప్రవర్తన కింద కొన్నింటిని, ఫిర్యాదుల మేరకు మరికొన్ని అకౌంట్లను సమీక్షించి నిషేధం విధించినట్లు ప్రకటించింది. వీటి ద్వారా ఎలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. నిజానికి ఈ ఫిగర్ ఈ సెప్టెంబర్‌లో నమోదైన ఫిగర్‌కంటే తక్కువే. కానీ, కేవలం అభ్యంతరకర ప్రవర్తన పేరుతో తొలగించిన అకౌంట్లు ఈసారే ఎక్కువ రికార్డు కావడం విశేషం.
ఇక ప్రతీ నెలలాగే అబ్యూజ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చర్యలు చేపటినట్లు ప్రకటించుకుంది వాట్సాప్. ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న దగ్గరి నుంచి, దాని కార్యకలాపాలు, ఇతర గ్రూపులో వ్యవహరించిన తీరు, ఫీడ్‌బ్యాక్, రిపోర్టులు..ఇతర అకౌంట్లు బ్లాక్ చేయడం తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నట్లు, ఇక 500 ఫిర్యాదుల ఆధారంగా ఒక అకౌంట్‌ను రద్దు చేసినట్లు వాట్సాప్ పేర్కొంది.
భారతీయుల అకౌంట్లను నిషేధించడంలో వాట్సాప్ అతిగా ప్రవర్తిస్తోందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఐటీ రూల్స్ 2021 అమలులోకి వచ్చాక ఇక్కడి అకౌంట్లపై ఎక్కువ దృష్టి పెడుతోంది. గ్రీవియెన్స్ చానెల్‌తో పాటు రకరకాల టూల్స్ సాయంతో ఇబ్బందికారక అకౌంట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించుకుంటోంది.
క్రమం తప్పకుండా నడుస్తున్న ఈ వ్యవహారంలో ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకున్నా.. తమ అకౌంట్లు డిలీట్ అవుతుండడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా వాట్సాప్ రిలీజ్ చేసే మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టులకు ఎలాంటి అధికారికత లేకపోవడంతో.. నిజంగానే సమీక్షించి చర్యలు చేపడుతోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఏడాది వేసవి నుంచి ఇప్పటిదాకా దాదాపు రెండు కోట్లకు పైగా భారతీయులను అకౌంట్లను వాట్సాప్ నిషేధించిందని గణాంకాలు చెప్తున్నాయి. అయితే వాట్సాప్ మాత్రం విమర్శలను తేలికగా తీసుకుంటోంది.